- విద్యార్థులకు అవగాహన కల్పించిన ఏసీపీ మాధవి
కాకతీయ, హుజురాబాద్: హుజురాబాద్ పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ మాధవి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పోలీసులు ఉపయోగించే పరికరాలు, సాంకేతిక సాధనాల గురించి వివరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ సమాచారాన్ని తమ తల్లిదండ్రులకు చేరవేయాలని సూచించారు. ఏసీపీ మాధవి తెలిపారు మంగళవారం ఉదయం 6 గంటలకు పోలీసు అమరవీరుల స్మారకార్థం సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు.
హుజురాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి రాజపల్లి మీదుగా హుజురాబాద్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగుతుందని వివరించారు. అలాగే ఈనెల 30న సబ్ డివిజన్ పరిధిలో పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి అమరవీరులకు నివాళులు అర్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమానికి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సీఐ కరుణాకర్, రూరల్, సీఐ పులి వెంకట్ గౌడ్, జమ్మికుంట సీఐ రామకృష్ణ, ఎస్సైలు యూనస్ అహ్మద్ అలీ, రాధాకృష్ణ, తిరుపతి, పోలీసు సిబ్బంది, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.


