- కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు..
- 42శాతం రిజర్వేషన్లపైనా చిత్తశుద్ధిలేదు
- ఆ రెండు పార్టీలు బంద్‌కు మద్దతివ్వడం హాస్యాస్పదం
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
- యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో మానవహారం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీసీల బంద్‌కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతుంటే రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్‌కు మద్దతు ప్రకటించటం హాస్యాస్పదంగా ఉందన్నారు. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ లు బంద్‌కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయన్నారు. హంతకులే నివాళులు అర్పించినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
సరైన వాదనలు వినిపించటం లేదు
స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి బీసీలను మోసం చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతామని ఆమె హెచ్చరించారు. తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశానికి ఆదర్శంగా నిలవాలన్నారు. బీసీల రిజర్వేషన్లు అమలు చేసేలా టెక్నికల్‌గా ప్రభుత్వాలు సరైన వాదనలు వినిపించటం లేదని ఆరోపించారు. ఈ కారణంగానే బీసీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పులు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ రూల్స్ ప్రకారం జనగణన నిర్వహించలేదని, జీవో 9 విషయంలో కూడా ఆపార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరగాల్సినంత తొందర ఏముందని ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలన్నారు. సర్పంచ్‌లకు బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వారిని ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు.
అన్ని పార్టీలు మోసం చేస్తున్నాయి
యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివశంకర్ మాట్లాడుతూ.. 78 ఏళ్లుగా బీసీలు రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నారన్నారు. కానీ రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయన్నారు. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ డ్రామాలు చేస్తోందని, రాష్ట్రపతి వద్ద బిల్లును పాస్ చేయించకుండా బీజేపీ కూడా నాటకాలు ఆడుతోందన్నారు. బీఆర్ఎస్ కుల గణన చేయకుండా మోసం చేసిందని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ లో బీసీల ఓట్ల కోసం కాంగ్రెస్ నాటకం ఆడుతోందని ఆరోపించారు. ఏ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయడంలేదన్నారు. బీసీలు మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.


