ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రావాలి
దీర్ఘకాలంలో లాభదాయక పంటగా ఆయిల్ ఫామ్
ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి శ్రీనివాస్ రావు
పంట పరిశీలించి సూచనలు చేసిన అధికారులు
కాకతీయ, రాయపర్తి : మండలంలోని మొరిపిరాల పన్యా నాయక్ తండాలో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన సదస్సు నిర్వహించారు. శుక్రవారం రామ్ చరణ్ ఆయిల్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సుకు జిల్లా ఉద్యానవన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి శ్రీనివాస్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ఆయిల్ ఫామ్ పంట రైతులకు దీర్ఘకాలికంగా మంచి ఆదాయం అందించే పంటగా మారుతుందని తెలిపారు. సాగు ఖర్చులు తక్కువగా ఉండటంతో పాటు స్థిరమైన మార్కెట్ ఉండటమే ఆయిల్ ఫామ్ ప్రత్యేకత అని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రైతులు ఆయిల్ ఫామ్ సాగుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
పంట పరిశీలన.. రైతులకు సూచనలు
అనంతరం రైతు భూక్య దేవులు సాగు చేస్తున్న ఆయిల్ ఫామ్ పంటను అధికారులు పరిశీలించారు. పంట సాగు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, దిగుబడి ద్వారా లభించే లాభాలపై రైతులకు వివరించారు. సరైన పద్ధతులు పాటిస్తే ఆశించిన దిగుబడులు సాధించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వీరభద్రం, వర్ధన్నపేట ఉద్యానవన శాఖ అధికారి రాకేష్, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సరికొండ కృష్ణారెడ్డి, గ్రామ సర్పంచ్ నునావత్ హిరని, పంచాయతీ కార్యదర్శి శాంతిరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


