కాకతీయ, తెలంగాణ బ్యూరో: టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ నటించిన “OG” (Original Gangster) సినిమాకు సంబంధించి టికెట్ ధరల పెంపుపై మరోసారి తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఇప్పటికే సెప్టెంబర్ 24న హైకోర్టు సింగిల్ బెంచ్ ప్రభుత్వం జారీ చేసిన టికెట్ ధరల పెంపు జీవోను సస్పెండ్ చేస్తూ కీలక తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాల ప్రకారం, ప్రీమియర్ షోలకు రూ.800, రెగ్యులర్ షోలకు పెంచిన ధరలు అమల్లోకి రాకుండా నిలిచిపోయాయి.
అయితే, ఈ సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్ చేసిన తర్వాత, హైకోర్టు డివిజన్ బెంచ్ ఆ తీర్పుపై స్టే విధించింది. అనంతరం, డివిజన్ బెంచ్ మళ్లీ ఈ విషయాన్ని సింగిల్ బెంచ్‌కే పంపిస్తూ మరోసారి విచారణ జరపాలని సూచించింది. దీంతో, OG సినిమా టికెట్ ధరలపై నేడు సింగిల్ బెంచ్ మళ్లీ విచారణ చేపట్టనుంది. ఈ కేసుపై సినీ ఇండస్ట్రీ, ఫ్యాన్స్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.


