- స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి
- కలెక్టర్ పమేలా సత్పతి
కాకతీయ, కరీంనగర్ : రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ లోకల్ బాడీ ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని ఎన్నికల షెడ్యూల్ వివరాలను ప్రకటించడంతో కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే, ఆర్డీవోలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ.. రెండు విడతల్లో గ్రామపంచాయతీ (సర్పంచ్, వార్డు సభ్యులు) ఎన్నికలు మొత్తం ఐదు విడతల్లో నిర్వహించనున్నారని, అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నవంబర్ 11 వరకు పూర్తి కానుందని వివరించారు. ఎన్నికల షెడ్యూల్ నేపథ్యంలో జిల్లాలో తక్షణం ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందన్నారు.
నోటిఫికేషన్ విడుదలైన తరువాత నామినేషన్ పత్రాల స్వీకరణ నుంచి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఇప్పటికే సిబ్బందికి ఎన్నికలకు సంబంధించిన శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్ఓ బి. వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో శ్రీనివాస్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేష్ బాబు, డీపీఓ జగదీష్, జడ్పీ డిప్యూటీ సీఈవో పవన్, కలెక్టరేట్ ఏవో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


