- వర్షాలతో కలిగిన నష్టంపై కలెక్టర్ సమీక్ష
కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాల వల్ల పంటలకు, ఆస్తులకు జరిగిన నష్టంపై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఉన్నతాధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో వర్షాల కారణంగా 8 పశువులు మృతి చెందినట్లు సమాచారం అందిందని, వాటి యజమానులకు వెంటనే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ అధికారులను ఆదేశించారు. పాక్షికంగా లేదా పూర్తిగా దెబ్బతిన్న ఇండ్లపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వెంటనే పరిహారం చెల్లించాలని సూచించారు. వర్షాలతో జిల్లాలో సుమారు 2036 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసినట్లు వివరించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు పంపాలని సూచించారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీ కార్యదర్శులు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దోమల వ్యాప్తి నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, అధికారులు పాల్గొన్నారు.


