మానుకోట జడ్పీపీఠంపై రెడ్ల కన్ను
జనరల్ కావడంతో రేసులోకి ఓసీలు
గంగారం నుంచి బరిలోకి యత్నాలు
కాంగ్రెస్ నుంచి రేసులోకి వేం నరేందర్‌రెడ్డి తనయుడు భార్గవ్‌రెడ్డి
పొలిటికల్ ఎంట్రీకి ఇదే సరైన సమయామని ఆలోచనే
జడ్పీచైర్మన్ జనరల్ కావడంతో మంచి ఆప్షన్‌గా చూస్తున్న వేం
సీఎం కుటుంబానికి సన్నిహితుడిగా వెన్నం శ్రీకాంత్ రెడ్డికి పేరు
సీనియర్ రాజకీయ తనయుడిగా మహబూబాద్‌లో నూకల అభినవరెడ్డికి గుర్తింపు
అధిష్ఠానంలో పెద్దలతో ముగ్గురు నేతలు టచ్‌లో..!
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి : మహబూబాబాద్ జిల్లా చైర్మన్ పదవిపై రెడ్లు కన్నేశారు. మహబూబాబాద్ జిల్లాలో గంగారం మండలం జనరల్‌కు కేటాయించారు. మిగతావన్నీ కూడా రిజర్వు కావడంతో ఇప్పుడు గంగారంపై రెడ్ల కన్ను పడింది. జనరల్ స్థానం నుంచి పోటీ చేసి గెలిస్తే.. జడ్పీ చైర్మన్ పదవిని చేజిక్కించుకోవచ్చనే అభిప్రాయంతో ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో ఉన్న గంగారం మండలం, ములుగు నియోజకవర్గం కింద ఉంది. సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్న గంగారం మండలం కాంగ్రెస్‌కు కంచుకోటగా మారింది. ఇక్కడి నుంచి పోటీ చేసే అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అన్నట్లుగా ఉండనుంది. టికెట్ తెచ్చుకుంటే జడ్పీటీసీ గెలుపు ఖాయమనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఆశవహులు..!
స్థానిక సమరానికి ఎన్నికల కమిషన్ షెడ్యూల్ జారీ చేయడంతో మహబూబాబాద్ జిల్లాలో రాజకీయ వేఢీ పెరిగింది. జడ్పీ చైర్మన్ జనరల్ కావడంతో.. ఇన్నాళ్లు రాజకీయ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న రెడ్డి లీడర్ల కన్ను ఇప్పుడు జడ్పీ చైర్మన్ పదవిపై పడింది. జిల్లాలో ఏకైక జనరల్ స్థానంగా ఉన్న గంగారం నుంచి బరిలోకి దిగా చైర్మన్ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి తనయుడు వేం భార్గవరెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖాయమైనట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి కుటుంబానికి సన్నిహితుడిగా రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉన్న రెడ్యాల మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత వెన్నం శ్రీకాంత్ రెడ్డి, దివంగత నేత నూకల నరేష్ రెడ్డి తనయుడు నూకల అభినవ్ రెడ్డి సైతం గంగారం నుంచి పోటీ చేసే ఆలోచనల్లో ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. వీరితోపాటు మరికొందరు ఆశావాహులు ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల ముఖ్య నేతల చుట్టూ ప్రదక్షిణలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్, బీజేపీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లపై స్ఫష్టత రావాల్సి ఉంది.
సీతక్క మద్దతే కీలకం..
గంగారం జడ్పీటీసీ స్థానం నుంచి టికెట్ దక్కాలన్నా.. గెలవాలన్న మంత్రి సీతక్క మద్దతే ఆశవహులకు, అభ్యర్థులకు కీలకం కానుంది. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో తనయుడు భార్గవరెడ్డి పొలిటికల్ ఎంట్రీకి దాదాపుగా రూట్‌మ్యాప్ సిద్ధమైందన్న వాదన వినిపిస్తోంది.ఇదిలా ఉండగా సీఎం కుటుంబానికి సన్నిహితుడిగా వెన్నం శ్రీకాంత్ రెడ్డికి గుర్తింపు ఉంది. కాంగ్రెస్ యువ నేతగా జిల్లా రాజకీయాల్లో మంచి పేరు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబాబాద్, పాలకుర్తి నియోజకవర్గాల్లో కో ఆర్డినేషన్ చేస్తూ అభ్యర్థుల గెలుపునకు ప్రయత్నం చేశారని అధిష్టానం పెద్దలు గుర్తించినట్లు సమాచారం. ఈమేరకు డీసీసీ రేసులోనూ ఇప్పుడు వెన్నం శ్రీకాంత్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. కాగా ఇప్పుడు జడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకునే లక్ష్యంతో గంగారం నుంచి జడ్పీటీసీగా బరిలోకి దిగే సమీకరణాలను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సీనియర్ రాజకీయ దివంగత నేత తనయుడిగా మహబూబాద్‌లో నూకల అభినవరెడ్డికి గుర్తింపు ఉంది. రాజకీయాల్లో నిలదొక్కుకునేందుకు జడ్పీటీసీ ఎన్నికలను వినియోగించుకునే ప్రయత్నాలను ఆరంభించినట్లు సమాచారం.


