ఘనంగా వడ్డే ఓబన్న జయంతి
కాకతీయ, కరీంనగర్ : స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మహేశ్వర్ మాట్లాడుతూ.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి ఆంగ్లేయ ప్రభుత్వానికి సవాల్ విసిరిన ధీరుడు వడ్డే ఓబన్న అని కొనియాడారు. ఆయన పోరాటం కేవలం ఒక వర్గానికి పరిమితం కాకుండా దేశ ప్రజలందరినీ బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేయాలనే మహోన్నత లక్ష్యంతో సాగిందన్నారు. అలాంటి మహనీయుడి జయంతిని ప్రభుత్వ స్థాయిలో అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. వడ్డే ఓబన్న త్యాగాలు, పోరాట స్ఫూర్తి నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని తెలిపారు. కార్యక్రమంలో బీసీ అభివృద్ధి శాఖ అధికారి ఎం. అనిల్ ప్రకాష్, జిల్లా వడ్డెర సంఘం ప్రతినిధులు బి. సమ్మయ్య, సిహెచ్. రాజ్‌కుమార్, సిహెచ్. పద్మ, ఓ. రమేష్, ఎస్. ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.


