గొర్రెల ఆరోగ్యానికి నట్టల మందు తప్పనిసరి
ఉచిత మందును సద్వినియోగం చేసుకోవాలి
: సర్పంచి మాదరి ప్రశాంత్
కాకతీయ, నెల్లికుదురు : ఆరోగ్యవంతమైన గొర్రెలు, మేకల పెంపకానికి నట్టల నివారణ మందు అత్యంత అవసరమని నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామ సర్పంచి మాదరి ప్రశాంత్ సూచించారు. పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న నట్టల మందును శనివారం గ్రామంలో గొర్రెలు, మేకలకు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నట్టల మందు వినియోగంతో పశువుల్లో ఉండే పురుగులు నివారించబడతాయని, తద్వారా వాటి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు దిగుబడులు కూడా పెరుగుతాయని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత సేవలను పెంపకదారులు పూర్తిగా ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ సిబ్బంది రాజేష్, మైసయ్య, గ్రామ యాదవ సంఘం నాయకులు పోతారాజు యాకయ్య, దేశాబోయిన శ్రీను, చిన్నల లక్మయ్య, పోతారాజు శ్రీనివాస్, పోలుదాసు ప్రసాద్‌తో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


