కాకతీయ, బిజినెస్ డెస్క్: ఏపీలోని మహిళలకు గుడ్ న్యూస్. అంగన్వాడీలో హెల్పర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. విశాఖపట్నం జిల్లాలోని మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ICDS ప్రాజెక్ట్ పరిధిలో అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియలో మొత్తం 53 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో భీమునిపట్నం ప్రాజెక్ట్‌లో 11, పాండురి ప్రాజెక్ట్‌లో 21, అలాగే విశాఖపట్నం ప్రాజెక్ట్‌లో 21 అంగన్వాడీ హెల్పర్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరగనుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదవ తరగతి (SSC) ఉత్తీర్ణులు అయి ఉండాలి. అదేవిధంగా, 2025 జూలై 1 నాటికి వయస్సు కనీసం 21 సంవత్సరాలు ఉండాలి, గరిష్ఠంగా 35 సంవత్సరాలు మించకూడదు. ప్రభుత్వ నియమాల ప్రకారం SC, ST, BC, EWS వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తుదారు ఆయా ప్రాజెక్ట్ పరిధిలోని గ్రామం నివాసి అయి ఉండటం తప్పనిసరి.
అర్హులైన అభ్యర్థులు మహిళా , శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫారమ్ నింపేటప్పుడు అందులో పేర్కొన్న అవసరమైన పత్రాలు.. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, విద్యా ధృవపత్రం, వయస్సు, కుల ధృవీకరణ పత్రాలు వంటి వివరాలను తప్పనిసరిగా జత చేయాలి. అసంపూర్ణమైన లేదా పత్రాలు లేని దరఖాస్తులు తిరస్కరిస్తారు.
ఈ నియామక ప్రక్రియలో ప్రతి ICDS ప్రాజెక్ట్‌ను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు. రిజర్వేషన్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన G.O.Ms.No.18 (తేదీ: 15.05.2015) ప్రకారం నియమాలు వర్తిస్తాయి.మరిన్ని వివరాల కోసం లేదా ఫారమ్ డౌన్‌లోడ్ చేయడానికి, అభ్యర్థులు మహిళా, శిశు సంక్షేమ శాఖ (WDCW) అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించవచ్చు.
చిరునామా:
కమిషనర్,
మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ,
విశాఖపట్నం జిల్లా.


