ఆగేది లేదు..!
స్థానిక ఎన్నికలకు సర్కారు సై
నేడు స్థానిక ఎన్నికల నోటిఫికేషన్..?!
ఎస్ఈసీకి రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా
ఉదయం 11 గంటలకు నోటిఫికేషన్ జారీ.. ప్రెస్‌మీట్‌కు సన్నాహాలు
ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఎస్ఈసీకి సంకేతాలు
నోటిఫికేషన్ జారీ తర్వాతనైనా హైకోర్టులో విచారణను ఎదుర్కోవాలని ప్రభుత్వం నిర్ణయం?
ముందుగా పార్టీ గుర్తుపై జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకే వెళ్లాలని నిర్ణయం
సోమవారం జీపీ ఎన్నికల షెడ్యూల్ సైతం ప్రకటించే అవకాశం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : స్థానిక ఎన్నికల నిర్వహణలో ఎలాంటి జాప్యం లేకుండానే ముందుకెళ్లాలనే గట్టి పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తోంది. శనివారం హైకోర్టు ధర్మాసనం నుంచి ఎదురైనా ప్రశ్నలకు నోటిఫికేషన్ తర్వాత కూడా విచారణలో బదులివ్వాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయానికి వచ్చినట్లుగా విశ్వసనీయంగా తెలిసింది. ఈ మేరకు న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్న తర్వాత ముందుకెళ్లడమే సరైందని రేవంత్ సర్కారు భావించినట్లుగా తెలుస్తోంది. సోమవారం ఉదయం పంచాయతీరాజ్‌శాఖ నుంచి రిజర్వేషన్లు,ఓటర్ల జాబితాను ఎస్ ఈసీకి చేరనుందని, ఆ తర్వాత వెంటనే ఎస్ఈసీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈమేరకు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే జడ్పీచైర్మన్, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచు, వార్డు స్థానాలకు రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను అధికార యంత్రాంగం పూర్తి చేసింది. అలాగే ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ఎక్సైజ్, పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖలతో పాటు ఇతర శాఖల అధికారులతో ఎన్నికల సంఘం అధికారులు సమావేశాలు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధతతో ఉంది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో సోమవారం ఉదయం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీకి సిద్ధమైనట్లుగా విశ్వసనీయంగా తెలిసింది.
విచారణను ఎదుర్కొనేందుక సిద్ధం..!
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన జీవోకు గెజిట్ లేదని, బీసీ రిజర్వేషన్ల బిల్లు గవర్నర్ ఆమోదానికి పంపడం..పెండింగ్‌లో ఉండగా అంత హాడావుడిగా ఎన్నికలకు వెళ్లడమెందుకంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత హైకోర్టు అక్టోబర్ 8కి విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే. విచారణ చేపట్టే వరకు స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వకుండా ఆగుతారా అంటూ కూడా ధర్మాసనం ప్రశ్నించింది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా విచారణను కొనసాగించవచ్చని కూడా ఏజీ బదులివ్వడంతో.. ఈ అంశంపై స్టే ఇవ్వకుండానే హైకోర్టు ధర్మాసనం అక్టోబర్ 8వ తేదీ వరకు విచారణను వాయిదా వేసింది. నోటిఫికేషన్ కంటే ముందే పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో నోటిఫికేషన్‌తో సంబంధం లేకుండా మెరిట్‌పై విచారణ చేపడతామని స్పష్టం చేసింది. దసరా సెలవుల తర్వాత ఈ పిటిషన్లు రెగ్యులర్ రోస్టర్ కలిగిన ద్విసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వస్తాయని కూడా తెలిపింది. ప్రస్తుతానికి ఎలక్షన్ నోటిఫికేషన్ పై గానీ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9పై గానీ హైకోర్టు ఎలాంటి స్టే విధించలేదు.
బీసీ రిజర్వేషన్లపై పిటిషన్లు..!
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించిపోతాయని, ఇది సుప్రీంకోర్టు తీర్పులతో పాటు పంచాయతీరాజ్ చట్టానికి వ్యతిరేకమని పేర్కొంటూ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా మూడుచింతలపల్లి మండలం కేశవాపూర్‌కు చెందిన బి.మాధవరెడ్డి, ఎస్.రమేశ్ తదితరులు హైకోర్టు శనివారం రెండు హౌజ్‌మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినందన్‌కుమార్ షావిలి, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు మయూర్‌రెడ్డి, జె.ప్రభాకర్ వాదనలు వినిపించారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే జీవోకు చట్టబద్ధత లేదని, గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్‌లో ఉండగా జీవో ఎలా జారీ చేస్తారంటూ అటార్నీ జనరల్‌ను ప్రశ్నించిన విషయం తెలిసిందే. గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు జీవో ఎలా ఇస్తారు..? 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదన్న విషయం తెలియదా..? అంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను హైకోర్టులో మరోసారి సవాల్ చేశారు రెడ్డి జాగృతి మాధవరెడ్డి. జీవోను రద్దు చేయాల్సిందేనంటూ ఆయన తరుపు లాయర్ వాదనలు వాదించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మూడు తీర్పులనూ హైకోర్టులో ప్రస్తావించారు.
ముందండుగేకు సన్నద్ధం..!
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో వెనక్కి తగ్గొద్దన్న ఆలోచనతో ఉన్న రేవంత్ సర్కారు..న్యాయపరమైన చిక్కులేమైనా ఎదురుతాయా అన్న సమాలోచనలు చేస్తోంది. వాస్తవానికి ఆదివారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదలవుతుందన్న ఊహాగానాలు వినిపంచినా.. దీనిపై ఒకట్రెండు రోజులు ఆగుదామా..? ఆలోచనలు చేసినా చివరికి ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపినట్లు సమాచారం. గవర్నర్ దగ్గర బిల్లు ఉన్నప్పుడు జీవో ఇవ్వడం సరికాదని కూడా హైకోర్టు సూచిచింది. అవసరమైతే మరో 2, 3నెలల సమయం కోరుతూ అఫిడవిట్ వేసుకోవాలని సూచించింది. దీనిపై స్పందించిన ఏజీ… ప్రభుత్వ నిర్ణయానికి రెండ్రోజుల సమయం కావాలని కోరింది. అలాగే నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని ఈసీని హైకోర్టు అడగగా… ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల సంఘం తరుపు న్యాయవాది బదులిచ్చారు. దీంతో ప్రభుత్వ ఉద్దేశంలో మాత్రం ఎన్నికలు నిర్వహించాలనే బలమైన పట్టుదల కనిపిస్తోందని స్పష్టమవుతోంది.


