బల్దియా కో-ఆప్షన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానం
ఏప్రిల్ 16 చివరి గడువు.. నిబంధనలు ఉల్లంఘిస్తే తిరస్కరణ
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగర పాలక సంస్థలో కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు, మున్సిపల్ చట్టంలోని నిబంధనల ప్రకారం ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ కో-ఆప్షన్ ప్రక్రియ ద్వారా నగర పాలక సంస్థలో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణయించిన ఫార్మాట్లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలో ఓటరుగా ఉండటం తప్పనిసరి. అదేవిధంగా ప్రభుత్వం నిర్ణయించిన వయస్సు, అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. దరఖాస్తులతో పాటు సంబంధిత పత్రాలు సమర్పించడం తప్పనిసరి. గుర్తింపు పత్రాలు, చిరునామా రుజువులు, ఇతర అర్హత ధ్రువపత్రాలను జతచేయాలని అధికారులు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా, అసంపూర్ణంగా లేదా తప్పుడు వివరాలతో వచ్చిన దరఖాస్తులను ఏ మాత్రం ఉపేక్షించకుండా తిరస్కరిస్తామని హెచ్చరించారు. దరఖాస్తులను ఏప్రిల్ 16, 2026 సాయంత్రం 5 గంటలలోపు కరీంనగర్ నగర పాలక సంస్థ కార్యాలయంలో సమర్పించాలని స్పష్టం చేశారు. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను పరిగణలోకి తీసుకోబోమని అధికారులు కఠినంగా పేర్కొన్నారు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహిస్తామని, అర్హులైన వారికి మాత్రమే అవకాశం కల్పిస్తామని వెల్లడించారు. కో-ఆప్షన్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు, సిఫార్సులు, ఒత్తిడులు పనిచేయవని స్పష్టం చేశారు.


