వైన్స్ షాపుల టెండర్లకు నోటిఫికేషన్
భారీగా పెరిగిన దరఖాస్తు ఫీజు
లాటరీ పద్ధతిలో కేటాయింపు
కంపెనీలు, భాగస్వామ్య సంస్థలకు అవకాశం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాల టెండర్లకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,620 వైన్స్ షాపుల లైసెన్సుల గడువు నవంబర్ 30తో ముగియనుండగా, డిసెంబర్ 1 నుంచి కొత్త లైసెన్సుల కేటాయింపుకు ఎక్సైజ్ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇకపై వైన్స్ షాపుల టెండర్లకు దరఖాస్తు రుసుమును గణనీయంగా పెంచారు. ఇప్పటివరకు రూ.2 లక్షలుగా ఉన్న ఫీజును, ఈసారి ఏకంగా లక్ష రూపాయలు పెంచి రూ.3 లక్షలుగా నిర్ణయించారు. ఈ రుసుము నాన్ రిఫండబుల్ అని స్పష్టం చేసింది ప్రభుత్వం.
లైసెన్స్ కాలపరిమితి..
2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ చెల్లుబాటు అవుతుంది. లైసెన్స్ ఫీజుల్లో ఎలాంటి మార్పులు చేయకపోగా, ఎంపికైన లైసెన్స్‌దారులు ఆరు స్లాబుల ప్రకారం ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. ఫిక్స్‌డ్ షాప్ టాక్స్ ఆధారంగా లాటరీ విధానంలో వైన్ షాపులను కేటాయించనున్నారు. దరఖాస్తుల సంఖ్యపై ఎలాంటి పరిమితులు లేవు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా సమర్పించుకోవచ్చు.
రిజర్వేషన్లు..
ఈసారి కేటాయింపుల్లో 30 రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. వాటిలో గౌడ్స్ వర్గానికి 15 శాతం, షెడ్యూల్డ్ కులాల వారికి 10 శాతం, షెడ్యూల్డ్ తెగల వారికి 5 శాతం వైన్స్ షాపులు కేటాయించనున్నారు. వ్యక్తులతో పాటు భాగస్వామ్య సంస్థలు, కంపెనీలకూ టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈసారి కూడా మద్యం దుకాణాల లైసెన్సులు జారీ చేయనుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. వైన్స్ షాపుల టెండర్లకు సంబంధించిన తుది తేదీలను త్వరలో ప్రకటించనుంది.


