అక్రమం.. అబద్దమట..!!
మల్లంపల్లి క్వారీలో అసలేం జరగలేదంట
ములుగు జిల్లా మైనింగ్ అధికారులకు కనబడని సాక్ష్యాలు
మల్లంపల్లి మట్టి దందాపై మైనింగ్ ఏడీ పొంతన లేని వివరణ
బాధ్యతారాహిత్యంగా రిజాయిండర్ విడుదలపై విమర్శలు
వాస్తవాలను బయట పెడితే..అసత్యమంటరా..? అంటూ జనం నుంచి విమర్శలు
సాక్ష్యాలతో సహా ప్రచురించినా అర్థం చేసుకోకపోవడం ఎవరి పొరపాటు..?
చిత్ర విచిత్రాలతో నిజాన్ని అబద్దం చేసే ప్రయత్నం కాదా..?
అనుమానాలు కలిగిస్తున్న అధికారుల వైఖరి

కాకతీయ, ములుగు ప్రతినిధి : అక్రమాన్ని అడ్డుకోలేని అధికారుల తత్వం.మరోసారి బయటపడింది. పక్కా సమాచారం, ఫొటోలతో సహా అక్షర సత్యాన్ని అధికారులకు కళ్లకు కడితే… అబ్బే అక్కడే ఏం తవ్వకాలు జరగలేదంటూ వివరణ ఇవ్వడం వారి వైఖరిపై అనుమానాలు కలిగిస్తోంది. ములుగు జిల్లా మల్లంపల్లి ప్రాంతంలో జరుగుతున్న మట్టిదోపిడీపై కాకతీయ వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. మూత పడినా క్వారీ నుంచి, అనుమతుల గడువు ముగిసిన క్వారీల నుంచి మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొంటూ కథనాలు ప్రచురించిన విషయం పాఠకులకు విదితమే. ఈ విషయాన్ని కళ్లకు కట్టే విధంగా ఫొటోలను కూడా కథనాలకు జత చేసింది.6న కాకతీయ దినపత్రికలో ప్రచురితమైన “మల్లంపల్లి అడ్డాగా మట్టిదోపిడి” కథనానికి గనులు మరియు భూగర్భశాఖ అధికారులు స్పందిస్తూ ఆ వార్త పూర్తిగా నిరాధారమని, సత్యానికి దూరమని పేర్కొంటూ రిజాయిండర్ విడుదల చేశారు. అయితే ఆ వివరణపై స్థానికులు, పత్రిక ప్రతినిధులు తీవ్రంగా స్పందిస్తున్నారు. వాస్తవ పరిస్థితికి భిన్నంగా.. పొంతన లేకుండా అధికారుల స్పందన ఉందన్న విమర్శలు వస్తున్నాయి. అయితే అధికారుల వివరణ కూడా ప్రయత్నం చేయగా.. నాడు స్పందించని అధికారులు.. మైనింగ్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారుల వివరణలతో ఇప్పుడు కదిలారు.

అబ్బే.. అలాంటి తవ్వకాలేం లేవు అక్కడ…
మల్లంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో కాకతీయ ప్రతినిధి చేసిన స్థల పరిశీలన మట్టి తవ్వకాలను గట్టిగా చెబుతోంది. మల్లంపల్లి–శ్రీనగర్ శివారులో ఉన్న మాధురి మైన్స్ పేరుపై గతంలో తవ్వకాలు జరిగిన క్వారీకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోవడంతో సంవత్సరం క్రితం తాత్కాలికంగా మూసివేయబడింది. కానీ గత వారం రోజులుగా అదే ప్రదేశంలో భారీ ఎస్కవేటర్‌తో తవ్వకాలు జరుగుతున్నట్టు స్థానికులు తెలిపారు. పత్రిక ప్రతినిధి ప్రత్యక్షంగా స్థలానికి వెళ్లి పరిశీలించగా, తాజాగా తవ్విన మట్టిపొరలు, భారీ యంత్రాల ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయని పేర్కొన్నారు. తనిఖీలలో పాల్గొన్న మైనింగ్ శాఖ ఆర్‌ఐ సిబ్బంది తీసిన ఫోటోలలో కూడా యంత్రాల ట్రాక్ గుర్తులు, మట్టిపొరల తవ్వకాలు స్పష్టంగా కనిపిస్తున్నా, శాఖ అధికారిక నివేదికలో మాత్రం “ఏమీ లభించలేదు” అని పేర్కొనడం అనుమానాస్పదమని పత్రిక ప్రశ్నించింది.
ఆధారాలతో నిరూపించేందుకు కాకతీయ సిద్ధం
మూతపడిన క్వారీ నుంచి అక్రమంగా తవ్వకాలు జరుగినట్లుగా కాకతీయ వద్ద పూర్తి స్పష్టమైన,నిర్దిష్ఠమైన ఆధారాలున్నాయి. దీన్ని నిరూపించేందుకు సిద్ధంగా ఉంది. తవ్వకాలు జరిగిన ఖచ్చితమైన స్థలం 18°07’07.4″N 79°52’53.2″E వద్ద ఉందని, ఆ ప్రదేశంలో ఇటీవలే తవ్వకాలు జరిగాయని స్పష్టమైన ఆధారాలతో నిరూపించగలమని ప్రకటిస్తున్నాం. ప్రజల సొత్తు రక్షించాల్సిన ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల ఒత్తిడికి తలవంచారా? లేక అక్రమార్కులతో కుమ్మక్కై మౌనంగా ఉంటున్నారా? అనే అనుమానాలు జనం నుంచి వ్యక్తమవుతున్నాయి. స్థానిక గ్రామస్తులు కూడా ఈ వివాదంపై స్పందిస్తూ ఇటీవలి కాలంలో రాత్రిపూట లారీలు తిరుగుతున్నాయి, పెద్ద యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయి. ఇవన్నీ మన కళ్లముందే జరుగుతుంటే అధికారులు గుర్తించలేదంటుండటం నవ్వులాటగా అనిపిస్తోందని విమర్శిస్తున్నారు.


