నోట్లు.. కోట్లు..!
డీటీసీ కిషన్ అక్రమ ఆస్తులు రూ.250 కోట్లుగా అంచనా
భూములు, హోటల్ వాటా, ఫ్లాట్లు, బంగారం స్వాధీనం
ఎం.కిషన్ నాయక్, మహబూబ్‌నగర్ డీటీసీ
లోతుగా విచారణ చేపడుతున్న ఏసీబీ అధికారులు
12చోట్ల ఏకకాలంలో దాడులు చేయడంతో అక్రమాల చిట్టా వెలుగులోకి
కాకతీయ, హైదరాబాద్ : రవాణా శాఖలో భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహబూబ్‌నగర్ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఎం.కిషన్ నాయక్ ఏసీబీ వలకు చిక్కిన విషయం తెలిసిందే. ఆయన వద్ద ఉన్న అక్రమ ఆస్తుల విలువ సుమారు రూ.250 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. మహబూబ్‌నగర్ డీటీసీగా విధులు నిర్వహిస్తున్న కిషన్ నాయక్ హైదరాబాద్ బోయినపల్లిలో నివాసం ఉంటున్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంటితో పాటు నిజామాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లలో కలిపి మొత్తం 12 చోట్ల ఏసీబీ అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. సోదాల్లో నారాయణఖేడ్ ప్రాంతంలో 31 ఎకరాలు, నిజామాబాద్ ప్రాంతంలో 10 ఎకరాల భూములు గుర్తించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని లహరి ఇంటర్నేషనల్ హోటల్‌లో 50 శాతం వాటా, రాయల్ ఓక్ ఫర్నిచర్ షాపుకు లీజుకు ఇచ్చిన 3,000 గజాల వాణిజ్య స్థలం కూడా కిషన్ నాయక్ పేరిట ఉన్నట్లు తేలింది. అదేవిధంగా కిలో బంగారు ఆభరణాలు, బ్యాంకు ఖాతాల్లో రూ.1.37 కోట్ల నగదు, అశోక్ టౌన్‌షిప్‌లో రెండు ఫ్లాట్లు, 4,000 గజాల స్థలంలో నిర్మించిన పాలీ హౌస్‌ను అధికారులు గుర్తించారు.
దర్యాప్తు కొనసాగింపు
కిషన్ నాయక్ బంధువుల ఇళ్లలో లభించిన ఆస్తి పత్రాలన్నింటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల ఆధారంగా మొత్తం అక్రమాస్తుల విలువ రూ.250 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ డీజీ చారుసిన్హా వెల్లడించారు. ఈ కేసులో మరింత లోతైన విచారణ కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు.


