“పురోగతి కాదు… తిరోగతి!” కరీంనగర్ బడ్జెట్‌పై సర్ధార్ ఫైర్
టౌన్ ప్లానింగ్‌లో అవినీతి ఆరోపణలు విచారణకు డిమాండ్
కాకతీయ, కరీంనగర్ : మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో నగర బడ్జెట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ మేయర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ సర్ధార్ రవీందర్ సింగ్ బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఘాటుగా స్పందించాడు. ప్రస్తుత బడ్జెట్ నగర అభివృద్ధికి ఉపయోగపడదని, “ఇది పురోగతి కాదు… స్పష్టమైన తిరోగతి” అని వ్యాఖ్యానించాడు.
టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతిని ప్రస్తావిస్తూ అధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. అక్రమంగా సంపాదిస్తున్న డబ్బు మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం బడ్జెట్ కంటే ఎక్కువగా ఉందని ఆరోపించాడు. నగరంలో హోల్డింగ్‌లు, ఫ్లెక్సీలపై సరైన పన్నులు విధించకుండా మాఫీలు ఇస్తూ నెలకు రూ.2–3 కోట్ల వరకు అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని పేర్కొన్నాడు.
ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వెంటనే సమగ్ర విచారణ జరపాలని కౌన్సిల్లో డిమాండ్ చేశాడు. అవినీతి కారణంగా మున్సిపల్ ఆదాయం దెబ్బతింటోందని, నగర అభివృద్ధి నిలిచిపోతుందని ఆందోళన వ్యక్తం చేశాడు.
ఇదే సమయంలో కౌన్సిల్ సమావేశంలో జాతీయ గీతాలాపన విషయంలో నిర్లక్ష్యం చోటుచేసుకున్నదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. జాతీయ గౌరవానికి భంగం కలిగించే చర్యలు అనవసరమని స్పష్టం చేశాడు.
అధికారుల అవినీతిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ, ప్రజల డబ్బు దోపిడీపై వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్చరించాడు. లేకపోతే ప్రజలు వీధుల్లోకి వచ్చి సమాధానం కోరే పరిస్థితి వస్తుందని పేర్కొన్నాడు.
ఈ పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నిస్తూ, పరిపాలనా వైఫల్యంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాడు. మున్సిపల్ వ్యవస్థలో పెరుగుతున్న అవినీతిపై పారదర్శక విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.


