ప్రమాదం కాదు.. హత్య..!
లాభాల కోసం ప్రాణాల పణంగా పెడుతున్నారంటూ విమర్శ
దుర్గా యాజమాన్యం నిర్లక్ష్యంతో కార్మికుడి మృతి చెందాడు
మణుగూరు ఓసీ-2లో ఘటనపై సీఐటీయూ ఘాటు స్పందన
యాజమాన్యం నిర్లక్ష్యంతోనే కార్మికుడు చనిపోయాడంటూ విమర్శలు
హత్యగా కేసు నమోదు చేయాలంటూ డిమాండ్
మైన్స్ ఏరియాలో కార్మిక చట్టాలు అమలు చేయడం లేదని మండిపాటు
కాకతీయ, మణుగూరు : మణుగూరు సింగరేణి ఓసి-2లో జరిగిన ఘటనలో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఇది ప్రమాదం కాదని, దుర్గా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంతో జరిగిన హత్యేనని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు ఆరోపించారు. బాధ్యులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.గాయపడిన కార్మికులను సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు కే బ్రహ్మచారి, కోశాధికారి పద్మ, సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం కొత్తగూడెం బ్రాంచ్ కార్యదర్శి భూక్యా రమేష్, మణుగూరు బ్రాంచ్ కార్యదర్శి గద్దల శ్రీనివాసరావులతో కలిసి బి మధు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు యాజమాన్యం నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనలో మరో ముగ్గురు కార్మికులు గాయపడి చికిత్స పొందుతున్నారు. సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సంఘాల నాయకులు పరామర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యాజమాన్యం వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల సమయంలో పాటించాల్సిన కనీస రక్షణ సూత్రాలు కూడా అమలు కాలేదని బి మధు పేర్కొన్నారు. ఫిట్నెస్ లేని వాహనాలు వినియోగించడం, విధి ప్రకారం పాటించాల్సిన నిబంధనలను విస్మరించడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. టైర్ పనుల్లో మిషన్ వినియోగించాల్సిన చోట చేతిపనితో నిర్వహించడం, చైన్ బిగించకుండా పని చేయించడం వంటి నిర్లక్ష్యాలు ప్రాణ నష్టానికి దారితీశాయని అన్నారు. మైన్స్ చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన రక్షణ కమిటీలు కూడా నామమాత్రంగా ఉన్నాయని విమర్శించారు. రక్షణపై శ్రద్ధ లేకపోవడం వల్లే కార్మికులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు.

చట్టాలు అమలు లేకపోవడంపై విమర్శలు
అంతర్రాష్ట్ర వలస కార్మిక చట్టాన్ని కూడా యాజమాన్యం ఉల్లంఘిస్తున్నదని మధు ఆరోపించారు. కార్మికుల వివరాలు నమోదు చేయకపోవడం, అవసరమైన అనుమతులు తీసుకోకపోవడం జరుగుతోందన్నారు. వేతనాలను బ్యాంక్ ద్వారా చెల్లించకపోవడం వల్ల కార్మికులకు రావాల్సిన నష్టపరిహారం కూడా దక్కడం లేదని చెప్పారు. చట్ట ప్రకారం రికార్డులు నిర్వహించకపోవడం, రక్షణ సూత్రాలన్నింటినీ విస్మరించడం వల్ల కాంట్రాక్ట్ కార్మికుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు కూడా తమ బాధ్యతలు నిర్వర్తించకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శించారు. ఇకనుంచి రక్షణ సూత్రాలను కఠినంగా అమలు చేయాలని, కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించాలని, సింగరేణి యాజమాన్యం పర్యవేక్షణ పెంచాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


