గేయం కాదు స్ఫూర్తి..
స్వాతంత్య్ర సమరానికి ప్రేరణ శక్తి..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
ఘనంగా వందేమాతరం ఉత్సవాలు
హాజరైన బీజేపీ నేతలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : వందేమాతరం గేయం 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నవంబర్ 7 నుండి 25 వరకు ‘వందేమాతరం@150’ పేరుతో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో ఘనంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. హనుమాన్ వ్యాయామశాల వద్ద నిర్వహించిన “వందేమాతరం@150” కార్యక్రమానికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే. లక్ష్మణ్, ఎంపీ డీకే అరుణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
భారతీయుల జీవన జ్యోతి
ఈసందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మాట్లాడుతూ.. వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. వందేమాతరమ్ అంటే భరతమాతకు వందనం.” మన రాష్ట్ర యువత, విద్యార్థులు వందేమాతరం గీతం అసలైన మహత్తును అర్థం చేసుకోవాలి. వందేమాతరం కేవలం ఒక గేయం మాత్రమే కాదు- అది భారతీయుల జీవన జ్యోతి. మన దేశ స్వాతంత్ర్య సమరానికి ప్రేరణనిచ్చిన శక్తిగా వందేమాతరం నిలిచింది. ఆ జ్వాల, ఆ ప్రేరణ మనలో ప్రతి రోజూ సజీవంగా ఉండాలి. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విధంగా.. స్వాతంత్ర్య పోరాటం జరిగిన రోజుల్లో ప్రజలు ఒకరినొకరు ఐక్యతను చాటిచెప్పేలా ‘వందేమాతరం’ అని అభివాదం చేసేవారు. అదే ఉత్సాహం, ఆ భావం ప్రతి భారతీయుడిని, ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలవాలి… అని రాంచందర్‌రావు అన్నారు.


