ప్రజా పాలన కాదు… పర్సంటేజీల పాలన!
ఎన్నికల హామీలు విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
పరకాల అభివృద్ధి ఘనత బీఆర్ఎస్దే
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి నిలిచిపోయింది
రెండేళ్ల పాలనలో పట్టణంలో కనీస అభివృద్ధి లేదు
పరకాల ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయంపై ధీమా
కాకతీయ, పరకాల : రాష్ట్రంలో కాంగ్రెస్ పేరుకే ప్రజా పాలన అంటూ చెప్పుకుంటోందని, వాస్తవంలో మాత్రం పర్సంటేజీల పాలన కొనసాగుతోందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ కాలం గడుపుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. పరకాల మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పట్టణంలోని పలు వార్డుల్లో జరిగిన ప్రచారంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, మున్సిపాలిటీ కోఆర్డినేటర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డితో కలసి ధర్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి బీఆర్ఎస్ నేత పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వమంటూ గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను నిలువునా మోసం చేస్తోందన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. పరకాల పట్టణ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని, మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అధికారం లేని కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలను పరిష్కరించే సత్తా బీఆర్ఎస్కే ఉందని స్పష్టం చేశారు.
పరకాల అభివృద్ధి చేసింది బీఆర్ఎస్నే
పరకాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని నాయకులు గుర్తుచేశారు. గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే పరకాల పట్టణానికి పట్టిన శనిలా మారారని తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటివరకు పట్టణంలో తట్టెడు మట్టి కూడా పోయని దుస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు రంగులు వేసుకుని తమ ఘనతగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసి కొత్తవి పెట్టుకోవడం కాంగ్రెస్ నేతల దుర్మార్గ రాజకీయానికి నిదర్శనమని అన్నారు.
కాంగ్రెస్ పాలనలో హామీలన్నీ హుళక్కే
పట్టణానికి కనీస మౌలిక వసతులు కల్పించడంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పారిశుధ్యం, తాగునీరు, రహదారుల అభివృద్ధి వంటి అంశాలపై కనీస శ్రద్ధ కూడా పెట్టలేకపోయిందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారని విమర్శించారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లేదు, రూ.500 గ్యాస్ సిలిండర్ అమలు కాలేదు, రైతు రుణమాఫీ ఊసే లేదు, ఇందిరమ్మ ఇండ్ల పథకంలో గోల్మాల్ జరుగుతోందని, మహిళలకు రూ.2500 ఆర్థిక సహాయం ఇవ్వలేదని, వికలాంగులకు రూ.6000 పెన్షన్ అమలు కాలేదని, విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పనున్నారని అన్నారు.
గులాబీ జెండా ఎగరడం ఖాయం
ఇలాంటి చేతకాని ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే ప్రజలంతా ఐక్యంగా నిలబడి పరకాల గడ్డపై గులాబీ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. కాంగ్రెస్ మాటలు విని మళ్లీ మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు. ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని, మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బోగస్ కాంగ్రెస్కు ప్రజల చేతుల్లో తప్పకుండా గుణపాఠం తప్పదని హెచ్చరించారు. పరకాల పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చింది, అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లేది కూడా బీఆర్ఎస్నేనని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


