- డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ
- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల తనిఖీ
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ, పీ.ఓ. ఎంహెచ్‌ఎన్ డాక్టర్ సనా జవేరియాతో కలిసి చిగురుమామిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం సందర్శించారు. ఈ సందర్శనలో అటెండెన్స్ రిజిస్టర్, అవుట్ పేషెంట్ రిజిస్టర్ సహా పలు రికార్డులను పరిశీలించారు. ఎన్‌సీడీ క్లినిక్‌లో అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధిగ్రస్తుల వివరాలను పరిశీలించి, వారికి అందజేస్తున్న ఉచిత మందుల సరఫరా పరిస్థితిని సమీక్షించారు. అవుట్ పేషెంట్లతో మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత మందులను క్రమంగా వాడాలని, దీంతో మందుల ఖర్చు తగ్గుతుందని సూచించారు. ఇన్‌పేషెంట్లను కలుసుకుని వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.
ఫార్మసీ స్టోర్లలో సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందుల నిల్వలను పరిశీలించారు. హెల్త్ క్యాంపులలో రీ-స్క్రీనింగ్ కార్యక్రమాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రసూతి గది పరిశుభ్రతను, అత్యవసర మందుల నిల్వలను కూడా పరిశీలించారు. మొదటి కాన్పులను సిజేరియన్ చేయించుకోవడం వల్ల కలిగే సమస్యలను వివరించి, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించే దిశగా గర్భిణీలు వారి కుటుంబ సభ్యులను అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందికి సూచించారు. పీహెచ్సీ డెలివరీలను మెరుగుపరచాలని ఆదేశించారు. ముల్కనూర్, అల్గునూర్ హెల్త్ వెల్నెస్ సెంటర్లు, కట్టరాంపూర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను సందర్శించారు. కార్యక్రమంలో డాక్టర్ సనా జవేరియా, చిగురు మామిడి పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ రమేష్, ముల్కనూర్ ఎంఎల్హెచ్పీ మంజుల, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


