- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 150కిపైగా దాఖలు !
- 100 మార్క్‌ని దాటిన అభ్యర్థుల సంఖ్య
- ప్రధాన పార్టీలతోపాటు స్వతంత్రులు పోటీ..
- 24న స్క్రూటినీ.. నవంబర్ 11న ఉప ఎన్నిక.. 14న రిజల్ట్
- కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే హోరాహోరీ ?
కాకతీయ, తెలంగాణ బ్యూరో : జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. ఉప ఎన్నికల్లో పోటీకి చివరిరోజులు పెద్ద ఎత్తున అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 150కిపైగా నామినేషన్లు దాఖలవగా.. అభ్యర్థుల సంఖ్య 100 మార్క్‌ని దాటింది. మూడు గంటల తర్వాత గేటు లోపల ఉన్న వారికి మాత్రమే అధికారులు నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీగా నామినేషన్స్ వేశారు. ఆర్‌ఆర్‌ఆర్ బాధిత రైతులు, ఓయూ నిరుద్యోగ వికాస నాయకులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల చివరిరోజున బీజేపీ తరఫున లంకల దీపక్‌రెడ్డి సైతం ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇప్పటికే బీఆర్‌ఎస్ తరఫున మాగంటి సునీత, కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ నామినేషన్లు వేశారు. రేపటి నుంచి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి సాయిరాం పరిశీలించనున్నారు. ఇక 24న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. నవంబర్ 11న జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుండగా.. 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు.

పోటాపోటీ..
దివంగత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆపార్టీ గోపీనాథ్ భార్యకు టికెట్ కేటాయించగా కాంగ్రెస్ నుంచి నవీన్‌యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఈ స్థానంలో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీలు తమదైన వ్యూహ రచనతో ముందుకు వెళుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్ ను కాదని కాంగ్రెస్ కు పట్టం కట్టడంతో అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్.. ఈ స్థానాన్ని గెలిచి మరో మారు తన సత్తా చూపించాలని భావిస్తోంది. అటు పదేళ్లు అధికారం అనుభవించిన బీఆర్ఎస్.. పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన విషయం తెలిసిందే. అయితే పార్టీకి పూర్వ వైభవం రావాలంటే జూబ్లీహిల్స్ నుంచే తొలి అడుగేసి గెలుపు రుచిని చూడాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది.


