యూరియా కొరత లేదు
రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు
నర్సంపేట ఏడీ విజయకుమార్
ఎరువుల యాప్‌పై రైతులకు అవగాహన
కాకతీయ, దుగ్గొండి : దుగ్గొండి మండలంలోని తొగర్రాయి గ్రామాన్ని వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ విజయకుమార్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కేంద్రంలో యూరియా టోకెన్ల పంపిణీ విధానం, సరఫరా పరిస్థితులను పరిశీలించారు. రైతులు అనవసరంగా గుమ్మిగూడవద్దని, యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం గ్రామపంచాయతీ ఆవరణలో రైతులతో సమావేశం నిర్వహించి, ఎరువుల బుకింగ్ అప్లికేషన్ వినియోగ విధానం, దాని వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ యాప్ ద్వారా యూరియాను సులభంగా పొందవచ్చని తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. ప్రతి రైతు తమ ఆరోగ్య దీపిక కార్డులో పంటల వివరాలు నమోదు చేసుకొని యూరియా పొందాలని సూచించారు. నర్సంపేట వ్యవసాయ సహాయ సంచాలకులు దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, నర్సంపేట డివిజన్‌లో ప్రతి గ్రామానికి రెండు నుంచి మూడు రోజుల వ్యవధిలో యూరియా సరఫరా జరిగేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొనగా, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.


