అవాంఛనీయ ఘటనలకు తావులేదు
పోలీస్ నిఘా, బందోబస్తు కొనసాగుతుంది
కరీంనగర్ సీపీ గౌస్ ఆలం
కాకతీయ, కరీంనగర్ :ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేందుకు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పోలీసు కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. చొప్పదండి, రామడుగు, గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాల్లో మొత్తం 33 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి కేంద్రం వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ వివరించారు. పలు కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లను ఆయన స్వయంగా పరిశీలించారు.జిల్లాలో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా సీపీ స్థానిక పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. పోలింగ్ రోజున మరింత కట్టుదిట్టమైన భద్రత ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, గతంలో నేర చరిత్ర కలిగిన వారిని బైండోవర్ చేస్తున్నట్లు సీపీ వెల్లడించారు.
ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఏసీపీ విజయకుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్సైలు రాజు (రామడుగు), వంశీకృష్ణ (గంగాధర), నరేష్ రెడ్డి (చొప్పదండి)తో పాటు ఇతర పోలీసులు పాల్గొన్నారు.


