*విజిలెన్స్ సైలెన్స్..!
*సీసీఐ అక్రమాలపై విచారణ ఏదీ..?!!
*క్షేత్రస్థాయి తనిఖీల తర్వాత ముందుకెళ్లని దర్యాప్తు
*బినామీ రైతుల పేర్లతో టీఆర్‌లు సృష్టించి మద్దతు ధరను కొల్లగొట్టిన మిల్లర్లు
*ఏడుగురు కార్యదర్శులపై చర్యలు తీసుకుని మిల్లర్లను వదిలేసిన ప్రభుత్వం
*అడ్డగోలుగా పర్సంటేజీలూ తీసుకున్న ఉన్నతాధికారులను వదిలేస్తారా..?
*ప్రభుత్వ తీరుపై రైతుల్లో వ్యక్తమవుతున్న విమర్శలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాకు జరిగిన పత్తి అమ్మకాల్లో అక్రమాలపై విచారణ చేపట్టిన విజిలెన్స్ సైలెన్స్‌ను ప్రదర్శిస్తోంది. రైతుల వద్ద ఎడా పెడా తక్కువ ధరకు ప్రైవేటుగా పత్తిని కొనుగోళ్లు చేసిన వ్యాపారులు.. అదే పత్తిని బినామీ రైతుల పేర్లతో టెంపరరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల సృష్టించి సీసీఐకి అమ్మి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లుగా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక దర్యాప్తులోనే ఏడుగురు వ్యవసాయ మార్కెట్ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేసింది. సస్పెన్షన్ వేటు పడిన వారిలో అప్పటి వరంగల్ ఏనుమాముల మార్కెట్ కార్యదర్శిగా నిర్మల, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మార్కెట్ కార్యదర్శి మధుకర్ (ఆదిలాబాద్ ఇన్చార్జ్ ), చెన్నూరు వ్య వసాయ మార్కెట్ కార్య దర్శి రామాంజనేయులు, జనగామ కార్యదర్శి సంగినేని శ్రీనివాస్, పెద్దపల్లి మార్కెట్ కార్యదర్శి పృథ్వీ రాజ్, భద్రాద్రి కొత్తగూడెం కార్యదర్శి శ్రీనివాస్, చిన్నకోడూరు కార్య దర్శి పరమేశ్వర్ ఉన్నారు.
వ్యవసాయశాఖ మార్కెట్ల కార్యదర్శలపై సస్పెన్షన్ వేటు వేసిన రాష్ట్ర ప్రభుత్వం డీటెయిల్డ్ ఎంక్వయీరీకి ఆదేశించడంతో విజిలెన్స్ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా వరంగల్ రీజియన్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పరిధిలోని నల్గొండ, సూర్యపేట, వరంగల్ ఎనుమాముల, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి, కరీంనగర్, జనగామ మార్కెట్లతో పాటు ఇతర మార్కెట్లలోనూ రికార్డులను, సీసీఐ కొనుగోలు నిల్వలు ఉంచిన మిల్లుల్లోనూ తనిఖీలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడారు. బ్యాంకులావాదేవీలను కూడా పరిశీలించారు.
తనిఖీలతో తర్వాత ముందుకెళ్లని విజిలెన్స్..!
వ్యవసాయ మార్కెట్ల కార్యదర్శులు, ఏవోలు, ఏఈవోలు, మార్కెటింగ్‌శాఖలోని డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సీసీఐ అధికారుల భాగస్వామ్యంతోనే మిల్లర్లు రైతుకు దక్కాల్సిన మద్దతు ధరను కొల్లగొట్టగలిగారని విజిలెన్స్ గుర్తించినట్లు సమాచారం. మార్కెట్లలో రికార్డులు, ఉద్యోగుల, మార్కెటింగ్ శాఖ సిబ్బంది విచారణ, సీసీఐ రికార్డులు, వ్యవసాయశాఖ అధికారులు జారీచేసి టీఆర్‌ల రికార్డులు, సీసీఐకి అమ్మకాలు సాగించిన రైతుల వివరాలను ఇలా గ్రౌండ్ రిపోర్టను సేకరించిన విజిలెన్స్ అధికారులు ఎందుకనో ఈ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లడంలో జాప్యం చేయడంపై అనుమానాలు కలుగులున్నాయి.
గత నాలుగుల నెలలుగా విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం. ప్రాథమిక విచారణలో అక్రమాలు జరిగినట్లుగా గుర్తించిన వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు ఏడుగురు మార్కెట్ల కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేసినా.. ఆతర్వాత జరిగిన విచారణలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల పాత్ర, మరికొంతమంది కార్యదర్శుల పాత్రలు కూడా వెలుగు చూసినా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇదీ ప్రక్రియ..!
వ్యవసాయశాఖ అధికారుల రికార్డలు ప్రకారం.. 2024-25లో రాష్ట్రంలోని 22 లక్షల మంది రైతులు 44.73 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. ఈ సాగులో 25.45 లక్షల టన్నుల మేర దిగుబడి వచ్చింది. ఈ పత్తిని కొనుగోలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ 302 కొనుగోలు కేంద్రాలను జిన్నింగ్ మిల్లుల వద్ద ప్రారంభించింది. సాధారణంగా పంట సాగు సమయంలోనే వ్యవసాయ విస్తరణ అధికారులు రైతుల పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా.. పంటల నమోదు, పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్ కార్డు వివరాలను నమోదు చేస్తారు. ఆ రైతులు నేరుగా సీసీఐకి వెళ్లి వాటిని చూపించి పంటను విక్రయించుకుంటారు. అయితే ఏదైనా కారణం చేతో పంటలను నమోదు చేసుకోని రైతులు, కౌలు రైతుల కోసం టీఆర్
విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వ్య వసాయాధికారి ధ్రువీకరణ పత్రం ఇస్తే మార్కెటింగ్ సిబ్బంది
టీఆర్ జారీ చేస్తారు. దానిని ఆధారంగా పత్తిని సీసీఐ కొనుగోలు చేస్తుంది.
తిలా పాపం తలా పిడికెడు..!
మిల్లర్ల అక్రమాలకు సహకరించే విషయంలో తిలా పాపం తలా పిడికెడు అన్నచందంగా అధికారులు వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. మిల్లర్ల మాయజాలానికి వ్యవసాయ ఏఈవోలు, ఏవోలు, మార్కెటింగ్ శాఖ సిబ్బంది, సీసీఐలోని పర్చేసింగ్ అధికారులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలా అన్ని స్థాయిల్లోని అధికారులు అక్రమాలకు సహకరించినట్లుగా ఆరోపణలున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో వందల కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లుగా తెలుస్తోంది.
ఏడుగురు మార్కెట్ కార్యదర్శులపై వేటు వేసిన ప్రభుత్వం సదరు.. అక్రమాలపై మాత్రం లోతైన విచారణను ముందుకు తీసుకెళ్లకపోవడానికి మిల్లర్లను రక్షించే ప్రయత్నమే కారణమన్న విమర్శలున్నాయి. కేవలం మార్కెట్ కార్యదర్శులపై వేటు వేసిన ఉన్నతాధికారులు ఈ మొత్తం అవినీతిలో భాగస్వాములైన వ్యవసాయశాఖ అధికారులపై చర్యలు తీసుకోకపోవడానికి కారణాలు మాత్రం వెల్లడించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ భూములపై ధ్రువీకరణ పత్రాల జారీ..?!
ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ భూములకు సంబంధించిన సర్వే నెంబర్లు వేసి కూడా రైతుల పేర్లతో వ్యవసాయ శాఖ అధికారులు ధ్రువీకరణపత్రాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. అసలు సాగు చేయకున్నా… సాగు భూమి లేకున్నా.. సదరు వ్యక్తులపేర్ల ఏఈవోలు ధ్రువీకరణ పత్రాలు జారీ చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కమీషన్లు తీసుకుంటూ ఇష్టానుసారంగా ధ్రువీకరణ పత్రాలను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఏఈవోలకు తెలియకుండా.. వారి సంతకాలను ఫోర్జరీ చేసి కొంతమంది రైతుల పేర్లతో మిల్లర్లకు ధ్రువీకరణ పత్రాలు అందజేసిన విషయం తాజాగా వెలుగులోకి రావడం గమనార్హం. మిల్లర్లు, వ్యవసాయ అధికారులు, మార్కెటింగ్ శాఖ అధికారులు కుమ్మక్కై సీసీఐకి అమ్మకాలు సాగిస్తున్న కుట్రలకు ఇదే సాక్ష్యాత్కారం.


