విమర్శలు కాదు..యూరియా తెప్పించండి
కేటాయించిన 50వేల మెట్రిక్‌లు రావాలి
బీజేపీ నేతల విమర్శలు అర్థరహితం
రైతులతో ఆందోళనలకు బీఆర్ ఎస్ కుట్రలు
యూరియా కొరతపై ప్రతిపక్షాల వ్యాఖ్యలు అర్థరహితం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : రైతులతో ఆందోళన చేయించడం కాదు.. ప్రభుత్వంపై బురద జల్లడం కాదు.. మీకు చిత్తశుద్ధి ఉంటే తెలంగాణకు ఈ సీజన్లో కేటాయించిన యూరియాను వెంటనే సరఫరా జరిగేలా చూడాలంటూ మంత్రి తుమ్మల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రైతాంగం అవసరాల దృష్ట్యా కేటాయింపు చేసిన 50 వేల మెట్రిక్ టన్నుల యూరియాను యుద్ధప్రాతిపదికన రాష్ట్రానికి చేరేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో యూరియా కొరతపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో చేసిన నిరసన ప్రదర్శనతో కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు.
ఎంపీల ఆందోళనతో తక్షణమే ఈ వారంలో 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కోసం కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు ఆదేశాలు జారీ చేశారన్నారు.కర్ణాటక నుంచి 10800 మెట్రిక్ టన్నుల యూరియా మొదటి షిప్ మెంట్ ప్రారంభమైందన్నారు. ఈ వారంలో మరో మూడు షిప్ మెంట్ ల ద్వారా యూరియా సరఫరా చేయాలని కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కు డైరెక్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఈ నెలలో యూరియా వినియోగం ఎక్కువగా ఉన్నందున జాప్యం లేకుండా సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి తుమ్మల కోరారు.

తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా ఈ ఖరీఫ్ సీజన్ కు తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా కేంద్రం కేటాయింపులు చేసినట్లు తెలిపారు. ఆగస్ట్ 31 నాటికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలి కానీ ఇప్పటి వరకు 5.42 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే సరఫరా చేశారని మంత్రి తెలిపారు. కేటాయించిన యూరియాలో 2.88 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాలో కొరత వల్ల రైతాంగంలో ఆందోళన నెలకొందన్నారు. ఈ నెలలో యూరియా వినియోగం ఎక్కువ ఉన్నందున కేటాయించిన యూరియాకు అదనంగా 80 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు రసాయనాల మంత్రిత్వ శాఖను మంత్రి తుమ్మల కోరారు. ఈ వారంలోనే మిగతా మూడు షిప్మెంట్ల ద్వారా యూరియా సరఫరా సకాలంలో చేయాలని మంత్రి తుమ్మల కోరారు.
బఫర్ స్టాకుపై ప్రతిపక్షాల వ్యాఖ్యలు అర్థ రహితం..!
బఫర్ స్టాక్స్ పై ప్రతిపక్ష పార్టీ ల నేతల వ్యాఖ్యలు అర్థరహితమని మంత్రి తుమ్మల వివరణ ఇచ్చారు. మార్క్ ఫెడ్ ను నోడల్ ఏజెన్సీ గా నియమించి ఎరువులు ముందుగానే తెప్పించి మే నుంచి బఫర్ స్టాక్స్ నిలువ చేయాలని ప్రతిపాదన చేస్తే కేంద్రం ప్రభుత్వం జాప్యం చేస్తూ యూరియా కొరతకు కారకులయ్యారని అన్నారు.కొందరు బీఆర్ఎస్ నేతలు వారి అనుచరులతో యూరియా కేంద్రాల వద్ద చెప్పులు క్యూ లైన్ లో పెట్టి ప్రేరేపిత ఆందోళనలకు పాల్పడ్డారని అన్నారు. యూరియా కొరత పై రైతాంగం ఆందోళన చెందే విధంగా కుట్రలు చేస్తున్నారని మంత్రి తుమ్మల మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అవగాహన రాహిత్యంతో సమస్యను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని మంత్రి స్పష్టం చేశారు. రైతాంగం ప్రయోజనాల కంటే రాజకీయ విమర్శలకే ప్రాధాన్యం ఇస్తున్నారని, తెలంగాణ రైతాంగంపై బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే యూరియా సరఫరాలో కొరత లేకుండా చేయాలని తుమ్మల తెలిపారు.


