- రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మోర్తాల చందర్‌రావు
కాకతీయ, వరంగల్ : పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై ఎలాంటి షరతులు పెట్టకుండా మొత్తం పంటలను సిసిఐ, మార్క్ ఫైడ్ ద్వారా కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మోర్తాల చందర్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వరంగల్ ఏనుమాముల మార్కెట్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం చందర్‌రావు మాట్లాడుతూ డాక్టర్ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం సీటు ప్లస్ 50శాతం అదనపు ధరలు చెల్లించేలా చట్టం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
విదేశీ వ్యవసాయ దిగుమతులపై సుంకాన్ని రద్దు చేసి.. బడా వ్యాపారులకు మేలు చేస్తున్న కేంద్రం, మన దేశ పత్తికి రూ.8,100, మొక్కజొన్నకు రూ.2400 నిర్ణయించడం దారుణమన్నారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని ఆందోళనలో ఉన్న రైతులను ఆదుకోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని గుర్తు చేశారు. నిబంధనల పేరిట రైతులను ఇబ్బంది పెట్టకుండా.. పండిన మొత్తం పంటలను ప్రభుత్వం మద్దతు ధరలతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం ఉపాధ్యక్షులు బాషిపాక రమేష్, సహాయ కార్యదర్శి గోనె కుమారస్వామి, కోశాధికారి కూస సంపత్ కుమార్, జిల్లా నాయకులు బల్చుకూరి నరసయ్య , మాదం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.


