ఆహార నాణ్యతలో రాజీ లేదు
విద్యార్థుల సంక్షేమమే ప్రాధాన్యం
జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
తనిఖీల్లో నాణ్యతపై కఠిన హెచ్చరిక
కాకతీయ, జనగామ : విద్యార్థులకు శుచిరుచికరమైన ఆహారం అందించాలి, నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండకూడదని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. ఆదివారం తరిగొప్పుల మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కేజీబీవీని ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, ఆహార పదార్థాల నాణ్యతను కచ్చితంగా పాటించాలని సిబ్బందిని హెచ్చరించారు. గుడ్లను నీటిలో వేసి నాణ్యతను పరిశీలించారు. పప్పులు, బియ్యం, నిత్యావసర సరుకులను తనిఖీ చేశారు. అరటిపండ్లను తూకం వేసి పరిమాణాన్ని పరిశీలించారు. వంటగదిలో తయారైన అన్నం, కూరల నాణ్యతను పరిశీలించారు. పాఠశాల పరిసరాల్లో పరిశుభ్రతను పాటించాలని ఆదేశించారు. గ్యాస్ సిలిండర్ సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ఇంగ్లీష్ పరీక్షకు ప్రణాళికాబద్ధంగా సిద్ధం కావాలని సూచించారు. పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ప్రోత్సహించారు. శుభాకాంక్షలు తెలిపారు. ఈ తనిఖీలో ఇంగ్లీష్ సీఆర్డి, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


