కాకతీయ, నేషనల్ డెస్క్: ముక్కుపచ్చలారని ఓ పసికందును కన్న తల్లిదండ్రులే కర్కశకంగా ప్రవర్తించారు. 15 రోజుల పసికందును అడవిలో వదిలేశారు. ఆ బిడ్డ నోట్లో రాయి పెట్టి, మూతి మీద జిగురు అతికించి ఊపిరాడకుండా చేసిన ఘటన అందరినీ కలచివేస్తోంది.
ఈ హృదయ విదారక సంఘటన రాజస్థాన్ లోని భిల్వారా జిల్లా పరిధిలో జరిగింది. అడవిలో గేదెలను మేపుతున్న ఓ పశువుల కాపరి పొదల మధ్య ఆ పాపను గమనించాడు. చిన్నారి శ్వాస కోసం పోరాడుతూ కనబడటంతో వెంటనే దగ్గరికి వెళ్లాడు. పాప నోటికి జిగురు అతికించి ఉన్నట్లు గమనించి జాగ్రత్తగా తొలగించాడు. అయితే దానికంటే దారుణమైన విషయం అప్పుడే తెలిసింది. బిడ్డ నోట్లో రాయి పెట్టారని.
కాపరి ఆ రాయిని తీసివేసి, ఆలస్యం చేయకుండా శిశువును తన ఒడిలో తీసుకుని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి పరుగెత్తాడు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. అదృష్టవశాత్తూ పాప ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. శిశువు బతికి బయటపడటంపై పశువుల కాపరి ఊపిరిపీల్చుకున్నాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. పసిపాప తల్లిదండ్రుల ఆచూకీ కోసం దర్యాప్తు కొనసాగుతోంది. ఇటీవల 15 రోజుల వ్యవధిలో ఏ ఏ ఆసుపత్రుల్లో డెలివరీలు జరిగాయో వివరాలు సేకరిస్తున్నారు. ఈ మానవత్వం లేకుండా చేసిన చర్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


