గీసుగొండలో కొలువుదీరిన కొత్త సర్పంచులు
ప్రమాణ స్వీకారంతో గ్రామ పాలనకు నాంది
కొత్త పాలకులపై ప్రజల కోటి ఆశలు
కాకతీయ, గీసుగొండ : ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచులు సోమవారం అధికారికంగా కొలువుదీరి, ప్రమాణ స్వీకారం చేసి తమ బాధ్యతలను చేపట్టారు. గీసుగొండ మండలంలోని 21 గ్రామ పంచాయతీలకు ఎన్నికైన సర్పంచులతో ఆయా గ్రామాలకు నియమితులైన ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త పాలకవర్గాల బాధ్యతల స్వీకరణతో గ్రామాల్లో అభివృద్ధిపై ఆశలు చిగురించాయి. ఈ సందర్భంగా నూతన సర్పంచులు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతామని తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా మెరుగుదల, రహదారుల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు సమర్థవంతంగా అందించడం తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామాల్లో కోతులు, వీధి కుక్కల బెడద వంటి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వెంటనే పరిష్కరించేలా పనిచేస్తామని స్పష్టం చేశారు. నూతన సర్పంచుల బాధ్యతల స్వీకరణతో గ్రామాల్లో అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుందన్న ఆశాభావాన్ని గ్రామ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతారన్న నమ్మకంతో కొత్త పాలకులపై ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నూతన సర్పంచులు, వార్డు సభ్యులు, తహసిల్దార్ ఎండీ రియాజుద్దీన్, ఎంపీడీఓ వి. కృష్ణవేణి, ఎంపీఓ పాక శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.



