పోటీ పరీక్షలకు కొత్త దారులు
డిగ్రీ కళాశాలలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్ ప్రారంభం
రూ.50వేల విలువైన పుస్తకాలను అందజేసిన సుశ్రుత ఫౌండేషన్ అధ్యక్షుడు రవీందర్
కాకతీయ, నర్సంపేట టౌన్: విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించేందుకు నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్‌ను ప్రారంభించారు. విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వం అందించాలనే ఉద్దేశంతో ఈ సెల్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సుశ్రుత ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ మాలోతు రవీందర్ చౌకీదార్ కళాశాలకు యాభై వేల రూపాయల విలువైన పుస్తకాలను విరాళంగా అందించారు. కార్యక్రమానికి వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ బైరి సత్యనారాయణ అధ్యక్షత వహించగా, డాక్టర్ ఎం సోమయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో క్రమశిక్షణ, సమయపాలన, నిరంతర సాధన ఎంతో అవసరమని అన్నారు. గ్రామీణ విద్యార్థులు కూడా అవకాశాలను వినియోగించుకుంటే ఉన్నత స్థాయికి చేరగలరని చెప్పారు. వైస్ ప్రిన్సిపల్ సత్యనారాయణ మాట్లాడుతూ నాణ్యమైన పుస్తకాలు, సరైన మార్గనిర్దేశం ఉంటే విద్యార్థులు విజయాన్ని సాధించగలరని తెలిపారు. ఈ సెల్ విద్యార్థులకు ఉపయోగపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


