వెట్రి కళగం ప్రస్థానంపై కొత్త చర్చలు
త్రిష పాత్రపై తమిళనాడులో గుసగుసలు
కాకతీయ, సినిమా: తమిళ రాజకీయాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం పార్టీ ప్రస్థానం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో నటి త్రిష పేరు రాజకీయ వర్గాల్లో అనూహ్యంగా వినిపించడం ఆసక్తిని రేపుతోంది. విజయ్ రాజకీయ నిర్ణయాల్లో ఆమె పాత్ర ఉందన్న ప్రచారం తమిళ మీడియాలో జోరుగా సాగుతోంది. ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో త్రిష ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారన్న వార్తలు కూడా వినిపించాయి. ఆ తర్వాత విజయ్‌కు విచారణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పరిస్థితులు సర్దుకున్నాయన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాలపై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు అన్నాడీఎంకేతో సంబంధాల విషయంలో కూడా త్రిష మధ్యవర్తిత్వం వహిస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పార్టీకి మద్దతు పెంచే ప్రయత్నంలో ఆమె ఉన్నారన్న చర్చలు వినిపిస్తున్నాయి. అయితే త్రిష మాత్రం ఈ ప్రచారాలను ఖండించారు. తనకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం కూడా లేదని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆమె పేరు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


