ఇండియన్ టెక్కీలకు కొత్త కష్టాలు.. హెచ్-1బీ వేట ప్రారంభం!
హెచ్-1బీ వీసా అపాయింట్‌మెంట్లు వాయిదా
సోషల్ మీడియా తనిఖీల కారణంగానే ఈ నిర్ణయం
అమెరికా రాయబార కార్యాలయం క్లియర్ వార్నింగ్
కాకతీయ, ఇంటర్నేషనల్ : అమెరికా వెళ్లాలనుకునే ఇండియన్ టెక్కీలకు కొత్త కష్టాలు మొదలు కాబోతున్నాయా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. భారతీయ ఐటీ నిపుణులు, నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు అమెరికా ప్రయాణం ఇప్పటికే సవాలుగా మారింది. అయితే తాజాగా అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసా దరఖాస్తుదారుల కోసం కొత్త సోషల్ మీడియా తనిఖీ విధానాన్ని ప్రారంభించింది. దీనివల్ల భారత్‌లోని అనేక వీసా అపాయింట్‌మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి.
భారతంలోని అమెరికా రాయబార కార్యాలయం మంగళవారం రాత్రి దరఖాస్తుదారులకు కీలక సూచనలు జారీ చేసింది. వీసా అపాయింట్‌మెంట్ తేదీ మార్చబడినట్లు ఈమెయిల్ వచ్చినట్లయితే, కొత్త తేదీలోనే హాజరు కావాలని.. పాత తేదీలో హాజరు అయినవారిని కాన్సులేట్‌లోకి అనుమతించబోమని వార్న్ చేసింది. ప్రస్తుతం డిసెంబర్ మధ్య నుంచి చివరి వరకు జరగాల్సిన ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది మార్చి నెలకు మార్చబడ్డాయి.
అమెరికా కొత్త సెక్యూరిటీ మాప్పింగ్ విధానంతో, హెచ్-1బీ, హెచ్-4 వీసా దరఖాస్తుదారులు తన సోషల్ మీడియా ప్రొఫైల్ పబ్లిక్ చేయడం తప్పనిసరి. అధికారులు ఈ నెల 15 నుంచి ఆన్‌లైన్ కార్యకలాపాలను సమీక్షించి, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే వారిని వెంటనే గుర్తిస్తారు. కాగా, ట్రంప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై గట్టి నిఘా విధించబడింది. గతంలో 100,000 డాలర్ల రుసుము, కొన్ని దేశాల నుంచి గ్రీన్ కార్డు దరఖాస్తులను నిలిపివేయడం వంటి చర్యలు ఇప్పటికే అమలు చేశారు. ఇలాంటి కొత్త నియమాలు, వాయిదా పడిన అపాయింట్‌మెంట్లు, సోషల్ మీడియా చెకింగ్.. ఇవన్నీ భారతీయ టెక్కీలకు ఇప్పుడు అమెరికా వీసా మార్గాన్ని మరింత కఠినతరంగా మార్చేశాయి.


