* అద్దె గర్భాలకు మహిళలను సమకూర్చిన లక్ష్మిరెడ్డి
* విచారణలో కీలక విషయాలను వెల్లడించిన నిందితురాలు
* లక్ష్మీరెడ్డి డైరీలో 50 మందికిపైగా సరోగసి మహిళల వివరాలు
* ఫర్టిలిటీ సెంటర్లు, నగదు వివరాల నమోదు..!
* ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ సహిత స్టేట్‌మెంట్ రికార్డు
* ఇప్పటికే ఆరు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసిన మేడ్చల్ పోలీసులు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ మహానగరం, పట్టణ శివారులోని ఫెర్టిలిటీ సెంటర్ల పాపాల పుట్ట పగులుతోందా.? అంటే అధికార వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. మేడ్చల్ జిల్లా చింతల్‌లో వెలుగులోకి వచ్చిన నరేద్దుల లక్ష్మిరెడ్డి సాగించిన సరోగసి దందాలో అక్రమాలు ఒక్కోటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి.
పేద మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారి జీవితాలతో ఆడుకుంటున్న ముఠా ఆటలు కట్టించేందుకు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ప్రధాన ఆర్గనైజర్లు నరేంద్రుల లక్ష్మి రెడ్డి, ఆమె కుమారుడు నరేందర్ రెడ్డిగా గుర్తించి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈకేసులో ఫెర్టిలిటీ సెంటర్ల నుంచే మొత్తం నెట్వర్క్ మొదలైనట్లుగా.. అక్కడి నుంచి వచ్చే ఆర్డర్లతోనే ప్రధాన నిందితురాలైన నరేద్దుల లక్ష్మిరెడ్డి యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తున్నట్లుగా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులు..!
లక్ష్మీరెడ్డి ఇంట్లో అదుపులోకి తీసుకున్న మహిళలు వెల్లడించిన వివరాలు, ఆమె డైరీలో లభ్యమైన వివరాల ఆధారంగా ఆరు ఫెర్టిలిటీ సెంటర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఆమె నివాసంలో సోదాలు జరపగా, అనేక కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సరోగసీ మహిళలతో రాయించుకున్న బాండ్లు, హెగడే హాస్పిటల్ మరియు ఇతర ఫెర్టిలిటీ సెంటర్ల నివేదికలు, ప్రామిసరీ నోట్లు, బాండ్లు, హార్మోన్ ఇంజెక్షన్లు లభ్యమయ్యాయి. లక్ష్మి సరోగసీ మహిళలను ప్రలోభపెట్టి వారి నుంచి సుమారు ₹25 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.
లక్ష్మీరెడ్డితో ఉన్న ఫెర్టిలిటీ సెంటర్‌కు ఉన్న సంబంధం ఏంటీ..? నగదు లావాదేవీలు, కాంటాక్టు వంటి ఇతర అంశాలపై వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ప్రాథమికంగా ఆధారాలు లభించడంతోనే నోటీసులను జారీ చేసినట్లుగా తెలుస్తోంది. పోలీసులు నోటీసులు జారీ చేసిన వాటిలో మాదాపూర్‌లోని హెగ్డె ఫర్టిలిటీ హాస్పిటల్(Hegde Fertility Hospital (Madhapur), సోమాజిగూడలోని అను టెస్ట్ ట్యూబ్ సెంటర్ (Anu Test Tube Centre (Somajiguda), బంజరాహిల్స్‌లోని ఫెర్టికేర్ (FertyCare (Banjara Hills), ఈవా ఐవీఫ్(Eva ivf), అమూల్య ఐవీఎఫ్ సెంటర్ , కొండాపూర్‌లోని శ్రీ ఫెర్టిలిటీ సెంటర్ ఉన్నాయి.
డాక్టర్ సంహిత విచారణ:
ఈ కేసులో కీలకమైన హైదరాబాద్‌లోని ఓ ఫెర్టిలిటీ సెంటర్‌కు చెందిన డాక్టర్ సంహితను పోలీసులు విచారణకు పిలిచారు. నిందితురాలు లక్ష్మి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా, ఆమె పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. పోలీసులు లక్ష్మి చెప్పిన వివరాలను ధృవీకరించుకోవడానికి డాక్టర్ సంహితను వివిధ కోణాల్లో ప్రశ్నించినట్లు సమాచారం. ఈ ఫెర్టిలిటీ సెంటర్లో జరిగిన అక్రమ సరోగసీ లావాదేవీల గురించి, లక్ష్మికి, ఈ సెంటర్‌కి మధ్య ఉన్న సంబంధాల గురించి పోలీసులు ఆరా తీసినట్లుగా తెలిసింది. డాక్టర్ సంహిత ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు.
ఫెర్టిలిటీ సెంటర్‌పై ఆరా :
ఈ అక్రమ సరోగసీ కార్యకలాపాల్లో ఐవీఎఫ్ సెంటర్ల పాత్రపై పోలీసులు ప్రధానంగా దృష్టి పెట్టారు. లక్ష్మి తరచుగా ఈ సెంటర్లకు వెళ్లడం, అక్కడి వైద్యులతో సంప్రదింపులు జరపడం వంటి అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. చట్టబద్ధత లేకుండా సరోగసీ కార్యకలాపాలు సాగాయా, ఎవరెవరు ఈ దందాలో భాగస్వాములుగా ఉన్నారనే దానిపై అధికారులు పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మంది మహిళలకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తు పూర్తయితే, అక్రమ సరోగసీ దందా వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్ బయటపడనుంది. ఈ కేసు సామాజికంగా, న్యాయపరంగా కూడా చర్చకు దారితీసింది.


