వెట్‌లాండ్స్ పరిరక్షణలో నిర్లక్ష్యం సహించం
పెండింగ్ నివేదికలు వెంటనే ఇవ్వాలి
ముసలమ్మ కుంట, వెంకటాపూర్ పెద్ద చెరువు వివరాలు ఆలస్యం ఎందుకు?
శాఖల సమన్వయం లేకపోతే చర్యలు తప్పవు
జియో మ్యాపులు, భూ రికార్డులు తక్షణం సమర్పించాలి
సమీక్షలో వరంగల్ కలెక్టర్ సత్యశారద సీరియస్
కాకతీయ, వరంగల్ బ్యూరో : వరంగల్ జిల్లాలో చిత్తడి నేలల పరిరక్షణ అంశంపై జిల్లా కలెక్టర్ డా. సత్య శారద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న కీలక నివేదికలను వెంటనే సమర్పించాలని సంబంధిత శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి చిత్తడి నేలల కమిటీ సమావేశంలో కలెక్టర్ అధ్యక్షతన సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లా అటవీ శాఖ అధికారి అనూస్ అగర్వాల్ (మెంబర్ కన్వీనర్) గత సమావేశం అనంతరం జరిగిన పురోగతిని వివరించారు. జిల్లాలో గుర్తించిన ముఖ్యమైన వెట్‌లాండ్స్ — వరంగల్ రేంజ్ పరిధిలోని ముసలమ్మ కుంట, నర్సంపేట రేంజ్‌లోని వెంకటాపూర్ పెద్ద చెరువులకు సంబంధించిన పలు కీలక నివేదికలు ఇంకా పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. రెవెన్యూ, సాగునీరు, మత్స్య, పర్యాటక శాఖల నుంచి అవసరమైన సమాచారం అందాల్సి ఉందని తెలిపారు.
కీలక నివేదికలు తక్షణం సమర్పించాలి
వెట్‌లాండ్స్‌కు సంబంధించిన గూగుల్ జియో-రిఫరెన్స్ సరిహద్దు మ్యాపులు, భూ రికార్డులు (పహాని/భూ భారతి), సర్వే నంబర్ వారీగా విస్తీర్ణ వివరాలు, ఎఫ్‌టీఎల్ సరిహద్దు మ్యాపులు, ప్రభావ పరిధి మ్యాపులు తప్పనిసరిగా అందించాలని కలెక్టర్ ఆదేశించారు. సరస్సుల సాంకేతిక వివరాలు — లోతు, ఎత్తు, పీహెచ్ స్థాయి, నీటి ఉప్పుదనం వంటి అంశాలపై పూర్తి సమాచారం సమర్పించాలని సూచించారు. అదేవిధంగా సంబంధిత శాఖల సమ్మతి పత్రాలు, సాంకేతిక నివేదికలు ఆలస్యం లేకుండా అందించాలని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో సంయుక్తంగా పర్యటించి, పూర్తి స్థాయి నివేదికలను సమయపాలనతో అందించాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని స్పష్టం చేశారు.
సమన్వయం లేకపోతే పరిరక్షణ సాధ్యం కాదు
చిత్తడి నేలల పరిరక్షణ, అభివృద్ధి కార్యక్రమాల్లో శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. వెట్‌లాండ్స్ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని, వాటి సంరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. సంబంధిత శాఖలు బాధ్యతాయుతంగా వ్యవహరించి, సమగ్ర నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్, నర్సంపేట ఆర్డీవోలు సుమ, ఉమారాణి, అటవీ, రెవెన్యూ, సాగునీరు, మత్స్య, పర్యాటక శాఖల అధికారులు పాల్గొన్నారు.


