విధి నిర్వహణలో నిర్లక్ష్యం సహించను
రోగులకు సేవాభావంతో వైద్య సేవలు అందించాలి
భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్
మణుగూరులో ప్రభుత్వ సంస్థల్లో సుడిగాలి తనిఖీలు
ఆసుపత్రి, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల పరిశీలన
కాకతీయ, కొత్తగూడెం : విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని జిల్లా కలెక్టర్ అంకిత్ స్పష్టం చేశారు. గురువారం మణుగూరు మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించిన ఆయన పలు ప్రభుత్వ సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాల, గుండు సింగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ గిరిజన మోడల్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. ముందుగా మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ వార్డులు, ఔషధ నిల్వ గది, ఔట్‌పేషంట్ విభాగం, మందుల సరఫరా విధానం, సిబ్బంది హాజరు వివరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు.
రోగులకు సేవాభావంతో వైద్య సేవలు అందించాలి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల సేవాభావంతో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రిలో వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం మణుగూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ఆశ్రమ గిరిజన ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, కిచెన్ షెడ్, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, బోధన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు.
పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి
పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారో తెలుసుకున్నారు. గత సంవత్సరం ఫలితాలను పరిశీలించి ఈ ఏడాది వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థులు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యతతో పాటు పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. గిరి యూనిట్ ద్వారా సరఫరా అవుతున్న చిక్కీలను, విద్యార్థులకు సిద్ధం చేసిన మధ్యాహ్న భోజనాన్ని కలెక్టర్ స్వయంగా రుచి చూసి నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, వారికి నాణ్యమైన ఆహారం అందించడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. గుండు సింగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, హాజరు వివరాలు, వంటగది, నిల్వ గది, త్రాగునీటి సదుపాయాలను తనిఖీ చేశారు. పిల్లలకు మెనూ ప్రకారం పోషకాహారం సమయానికి అందేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత, ప్రధానోపాధ్యాయురాలు మహాలక్ష్మి, వైద్యులు, ఉపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.


