చెత్త సేకరణలో నిర్లక్ష్యం సరికాదు..!
తడి, పొడి, హానికర వ్యర్థాలు వేరు చేయాలి
మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్
కాకతీయ, రాయపర్తి : గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం సరికాదని మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక లక్ష్యాలను సాధించడంలో చెత్త నిర్వహణ కీలకమని పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని కాట్రపల్లి, కొలన్ పల్లి, కొత్తూరు గ్రామాల్లో పర్యటించిన ఆయన చెత్త సేకరణ, పారిశుధ్య పనులను పరిశీలించారు. మహిళా సంఘాలు, గ్రామ ప్రజలకు చెత్త వర్గీకరణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా తడి చెత్తను ఆకుపచ్చ బుట్టలో, పొడి చెత్తను నీలం బుట్టలో వేయాలని ప్రజలకు సూచించారు. వంటగది వ్యర్థాలు, పండ్లు, కూరగాయల తొక్కలు తడి చెత్తగా, ప్లాస్టిక్ కవర్లు, సీసాలు, పేపర్లు పొడి చెత్తగా వేరు చేయాలని తెలిపారు. వాడిన మాస్కులు, శానిటరీ నాప్‌కిన్లు, డయాపర్లు వంటి హానికర వ్యర్థాలను వేరుగా ఉంచి పంచాయతీ సిబ్బందికి ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచులు రాపాక పద్మ బ్రహ్మచారి, వంగాల ఎల్లమ్మ యాకయ్య, కందికట్ల స్వప్న సంతోష్, ఉపసర్పంచులు మునిగాల శ్రీధర్, చిప్ప శ్రీనివాస్, గుండ్లపల్లి మధు, కార్యదర్శులు రాజేందర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


