దేవాదుల కాలువలపై నిర్లక్ష్యం..
ఎండిపోతున్న పంటలు.. రైతుల ఆవేదన
ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆగ్రహం
కాకతీయ, నర్సంపేట టౌన్ : దేవాదుల ప్రాజెక్టు పరిధిలో సాగునీరు అందక రైతుల పంటలు ఎండిపోతున్నాయని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేష్ మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపించారు.
శనివారం ఏఐకేఎఫ్ జిల్లా కమిటీ డి-8 కాలువను పరిశీలించింది. వర్ధన్నపేట, సంగెం మండలాల చెన్నారం, రామచంద్రాపురం, గవిచర్ల, ఆశాలపల్లి గ్రామాల్లో పర్యటించింది. రైతుల సమస్యలను తెలుసుకుంది.
ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడారు. 1.23 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని చెప్పినా అమలు కాలేదన్నారు. డి-8 కాలువ ద్వారా వేల ఎకరాలకు నీరు చేరాల్సి ఉన్నా మెజారిటీ ప్రాంతాలు ఎండబడ్డాయని తెలిపారు.
కాలువల్లో పూడిక పేరుకుపోయిందన్నారు. చెట్లు, పొదలు పెరిగాయని చెప్పారు. లైనింగ్ పనులు పూర్తికాలేదని పేర్కొన్నారు. దీంతో నీటి ప్రవాహం నిలిచిపోయిందన్నారు.
రైతులు అప్పులు చేసి పంటలు వేసి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కాలువలను మరమ్మతు చేసి నీరు అందించాలని డిమాండ్ చేశారు.
నిర్లక్ష్య అధికారులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. లేకపోతే రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.
కార్యక్రమంలో కుసుంబా బాబురావు, మహమ్మద్ ఇస్మాయిల్ పాల్గొన్నారు. మంద రవి, సోమిడి రవి, శివ కుమారస్వామి, మహమ్మద్ రఫీ, అమ్మరాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


