దళిత, గిరిజనుల బడ్జెట్ ఖర్చులో నిర్లక్ష్యం
చేవెళ్ల డిక్లరేషన్ అమలు చేయాలి
డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి
కాకతీయ, గజ్వేల్ : రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల చట్టం కింద కేటాయించిన బడ్జెట్ను ఖర్చు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం, వివక్షత ప్రదర్శిస్తోందని దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఏగొండ స్వామి విమర్శించారు. శుక్రవారం గజ్వేల్ అంబేద్కర్ భవన్లో డిబిఎఫ్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలని, అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని ప్రారంభించాలని, చేవెళ్ల డిక్లరేషన్ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దాసరి ఏగొండ స్వామి మాట్లాడుతూ… 2025 – 26 బడ్జెట్లో దళితుల ప్రత్యేక నిధి కింద రూ 40,231 కోట్లు కేటాయించినప్పటికీ కేవలం రూ 16,374 కోట్లు మాత్రమే విడుదల చేసి, అందులోనూ రూ 6,726 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. ఇది దళితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కార్యదర్శి బ్యాగరి వేణు మాట్లాడుతూ బడ్జెట్ కేటాయింపులు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని అన్నారు. ఎస్సీల జనాభా ప్రకారం 18 శాతం రిజర్వేషన్లు పెంచుతామని ఇచ్చిన హామీని ప్రభుత్వం మరిచిందని విమర్శించారు. ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ 17,154 కోట్లు కేటాయించినప్పటికీ కేవలం రూ 3,431 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు తెలిపారు. బీఎస్పీ నాయకుడు కనక ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం బడ్జెట్ నిధుల కేటాయింపులు, ఖర్చులపై ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బెజగామ ప్రభాకర్, చంద్రం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


