ఎన్‌డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్
నెక్లెస్ రోడ్ వ్యూపాయింట్ వద్ద ఎక్సర్‌సైజ్
కాకతీయ, తెలంగాణ బ్యూరో: విపత్తు సంసిద్ధత, ప్రతిస్పందన విధానాలను బలోపేతం చేసే ప్రయత్నాల్లో భాగంగా జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ సహకారంతో హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్ వ్యూపాయింట్ వద్ద మాక్ ఎక్సర్‌సైజ్ విజయవంతంగా నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి వెంకటాచారి, డిప్యూటీ కలెక్టర్ రవి ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక సేవలు, వైద్యం, ఆరోగ్యం, రవాణా, నీటిపారుదల, విద్యుత్, నీటి సరఫరా, పౌర సరఫరాలు, పశుసంవర్ధక, యువజన సేవలు, హైడ్రా, ఇతర విభాగాలు సమన్వయంగా వ్యవహరించాయి. లోతట్టు పట్టణ ప్రాంతాలలో వరదలను తగ్గించే వ్యూహాలు, కమాండ్ నియంత్రణ విధానాలు, విపత్తు నిర్వహణ చట్టం కింద పాత్రలు బాధ్యతలపై ప్రజలకు వివరించారు.
కిమ్స్ ఆసుపత్రిలోనూ..
ఎన్‌డీఎంఏ లీడ్ కన్సల్టెంట్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్ విక్రమ్ సింగ్ మాన్ ఆసుపత్రి విపత్తు సంసిద్ధతను సమీక్షించడానికి కిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. అత్యవసర ప్రతిస్పందన ప్రోటోకాల్‌లు, సర్జ్ కెపాసిటీ, ట్రయాజ్ సిస్టమ్‌లు, సమన్వయ విధానాలను అంచనా వేశారు. వరద పరిస్థితుల్లో ఆసుపత్రి స్థాయి విపత్తు నిర్వహణ, వైద్య ప్రతిస్పందనను బలోపేతం చేయడానికి విలువైన సూచనలు అందించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమాండెంట్ హరీష్, హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న, హైడ్రా అగ్నిమాపక అధికారి యజ్ఞ నారాయణ, హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ వెంకటి, ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహిపాల్, జీహెచ్ఎంసీ సూపరింటెండింగ్ ఇంజినీర్ వెంకటశేషయ్య సీనియర్ అధికారులు పాల్గొన్నారు.


