అల్ఫోర్స్‌లో ముగిసిన ఎన్సీసీ ఆపదమిత్ర శిక్షణ శిబిరం
కాకతీయ, కరీంనగర్ రూరల్ : స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో నిర్వహించిన ఎన్సీసీ ఆధ్వర్యంలోని యువ ఆపదమిత్ర శిక్షణ శిబిరం ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా. వి. నరేందర్ రెడ్డి, ఎన్సీసీ 9వ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ ఏ.కే. జయంతతో పాటు ఇతర అధికారులు హాజరై కేడెట్లను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ సమగ్రత, దేశభక్తి ప్రతి పౌరుడి ప్రాథమిక విలువలని, అవే దేశ అభివృద్ధికి పునాదులని పేర్కొన్నారు. విద్యార్థుల్లో కర్తవ్యబోధ, బాధ్యతా భావం పెంపొందించడంలో ఎన్సీసీ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఎన్సీసీ విధానాలు యువతకు క్రమశిక్షణతో పాటు నాయకత్వ లక్షణాలను అలవర్చుతాయని వివరించారు.లెఫ్టినెంట్ కర్నల్ జయంత మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుంచే దేశం పట్ల బాధ్యతలు, హక్కులపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు. ఎన్సీసీ కార్యక్రమాల్లో ప్రణాళికాబద్ధంగా పాల్గొనాలని సూచించారు. దేశ రక్షణతో పాటు సామాజిక, ఆర్థిక అభివృద్ధిలోనూ ఎన్సీసీ పాత్ర ఉందన్నారు.
వారం రోజులపాటు జరిగిన ఈ శిబిరంలో విపత్తు నిర్వహణ, రక్షణ చర్యలపై కేడెట్లకు ప్రాయోగిక శిక్షణ అందించారు. స్విమ్మింగ్ పూల్‌లో రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం ( ఎస్ డి ఆర్ ఎఫ్) ఆధ్వర్యంలో రోప్ రెస్క్యూ, సెర్చ్ అండ్ రెస్క్యూ పద్ధతులపై ప్రదర్శనలు నిర్వహించారు. ఈ విన్యాసాలు కేడెట్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి.
శిబిరంలో పాల్గొన్న కేడెట్లకు వసతి, పౌష్టికాహారం వంటి సదుపాయాలను సమృద్ధిగా కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కేడెట్లకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
శిబిరం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అల్ఫోర్స్ విద్యాసంస్థల యాజమాన్యానికి ఎన్సీసీ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కర్నల్ వి. కృష్ణ, సుబేదార్ మేజర్ జె. సూర్య ప్రసాద్, ఏఎన్ఓలు, జీసీఐలు, పీఐ సిబ్బంది, ఎన్సీసీ కేడెట్లు పాల్గొన్నారు.


