అట్టహాసంగా నవీన్‌యాదవ్ నామినేషన్
షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో దాఖలు
హాజరైన మంత్రులు పొన్నం, వివేక్, మేయర్
మద్దతు తెలిపిన ఎంపీ అసదుద్దీన్ ..
ఆలింగనం చేసుకొని ఆల్ ది బెస్ట్..
అభిమానులు, పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : జుబ్లిహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ ఇవాళ నామినేషన్ వేశారు. షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్‌కు నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ సందర్భంగా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్‌చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ తోపాటు మేయర్ విజయలక్ష్మి, కాంగ్రెస్ నేతలు హాజరయ్యారు. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ షేక్‌పేట తహసీల్దార్ కార్యాలయం వద్ద నవీన్‌యాదవ్‌ను కలిసి మద్దతు తెలిపారు. నవీన్‌ను ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లాలని సూచించారు.
రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతాం..
మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ మాట్లాడుతూ.. ఎలాగూ ఓడిపోతామని ముందే తెలిసి, ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ ఓట్ల చోరీ డ్రామా ఆడుతోందని మండిపడ్డారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీలు ఏం చేశాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాభిప్రాయం మేరకే నవీన్ యాదవ్‌కు టికెట్ కేటాయించినట్లు చెప్పారు. కంటోన్మెంట్ మాదిరిగానే జుబ్లిహిల్స్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలవాలని, నవీన్‌యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. తెలంగాణలో ప్రజా పాలన కొనసాగుతోందని, జుబ్లిహిల్స్‌ను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దుతామని మంత్రులు తెలిపారు.


