4 కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా 12న దేశవ్యాప్త సమ్మె
కాకతీయ, ఖమ్మం : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక చట్టాలకు నిరసనగా అల్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ సమ్మెలో ఖమ్మం జిల్లాలోని అన్ని కార్మిక సంఘాలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మం నగర ఐఎన్‌టీయూసీ అధ్యక్షులు నరాల నరేష్ మోహన్ నాయుడు అధ్యక్షతన స్థానిక సంజీవ రెడ్డి భవనంలో నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక చట్టాలు కార్మికుల హక్కులను హరించేవిగా ఉన్నాయని, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.
సమ్మెకు సమగ్ర మద్దతు
ఫిబ్రవరి 12న జరగనున్న సమ్మెలో అన్ని రంగాలకు చెందిన కార్మికులు పాల్గొని తమ నిరసనను తెలియజేయాలని నేతలు పిలుపునిచ్చారు. కార్మికుల ఐక్యతతోనే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచగలమని స్పష్టం చేశారు. కార్మిక చట్టాల పేరుతో ఉద్యోగ భద్రత, వేతనాలు, సామాజిక భద్రత హక్కులు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక వర్గం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ సమ్మె కీలకమని పేర్కొన్నారు. సమావేశంలో ఐఎన్‌టీయూసీ నగర అధ్యక్షులు నరేష్ మోహన్ నాయుడు, ఉపాధ్యక్షులు ఫజల్ మహమ్మద్, ఐఎన్‌టీయూసీ మోటార్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు పాల్వంచ కృష్ణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కళ్యాణం వెంకటేశ్వరరావు, కార్యదర్శి విష్ణు, టీయూసీఐ జిల్లా కార్యదర్శి రామయ్య, నగర అధ్యక్షకార్యదర్శులు ఎం. లక్ష్మీనారాయణ, కె. శ్రీనివాస్, బీఆర్‌టీయూ జిల్లా నాయకులు ఎండీ వై పాషా, సత్తార్ మియా, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు సుభాన్, షేక్ షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.


