కాకతీయ, రామగుండం: రాజీ మార్గం రాజమార్గమని, కక్షలు పెట్టుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బును వృథా చేసుకోవద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. ఈ నెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాజీ పడితే ఇద్దరూ గెలిచినట్లేనని, చిన్న చిన్న వివాదాలు పెంచుకుని జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవద్దని కమిషనర్ అన్నారు.
రాజీ పడదగిన కేసులలో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ తగాదాలు, ఆస్తి విభజన, కుటుంబ నిర్వాహణ, వైవాహిక తగాదాలు, బ్యాంకు రికవరీ, టెలిఫోన్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్ బౌన్స్ వంటి కేసులు వస్తాయని తెలిపారు.
పోలీస్ అధికారులు, సిబ్బంది కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లతో కలిసి రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చి అవగాహన కల్పించాలని సూచించారు. జుడిషియల్ విభాగం ఇచ్చిన ఈ అవకాశాన్ని కక్షిదారులు తప్పకుండా ఉపయోగించుకోవాలని కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు.


