లేబర్ కోడ్స్ తో దేశ అభివృద్ధి
కార్మిక చట్టాల చరిత్రలో గొప్ప సంస్కరణ
మహిళా కార్మికుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
కాకతీయ, తెలంగాణ బ్యూరో: దేశంలోని కార్మిక చట్టాల చరిత్రలో గొప్ప సంస్కరణగా మోదీ ప్రభుత్వ లేబర్ కోడ్స్ నిలిచాయని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. గతంలో ఉన్న 29 కార్మిక చట్టాలను కుదించి 4 ప్రధాన లేబర్ కోడ్స్ రూపొందించడం, సరళత, పారదర్శకత, సమర్థత, కార్మికుల సంక్షేమ దృష్ట్యా తీసుకున్న కీలక నిర్ణయం అన్నారు. సాంఘిక భద్రత అందరికీ అసంఘటిత రంగం, గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫార్మ్ వర్కర్లు వంటి వర్గాలు కూడా రక్షణ పొందేలా మారింది. వేతనాల్లో పారదర్శకత, సమయానుకూల సవరణలు, కార్మికుల జీవన ప్రమాణం మెరుగుపడే దిశగా మార్పులు చేశారన్నారు. మహిళా కార్మికుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం, సురక్షితమైన కార్యాలయ వాతావరణం, గౌరవప్రదమైన పని పరిస్థితులు కల్పించేందుకు ఉపయోగపడుతాయన్నారు.
జీవితంలో ఒక గొప్ప గౌరవం
పరిశ్రమలకు సరళీకృత విధానాలు, పెట్టుబడులు, ఉత్పత్తి, ఉద్యోగ అవకాశాలు పెరిగేలా వ్యవస్థను రూపొందించారన్నారు. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం తదితర అంశాలు ఈ కోడ్ ద్వారా మెరుగైన పద్ధతి లో అమల్లోకి వచ్చిందన్నారు. 2017లో కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ సంస్కరణల రూపురేఖలు సిద్ధమయ్యాయని గుర్తు చేసుకున్నారు. ఈ లేబర్ కోడ్స్‌ను రూపొందించడంలో ప్రధాని నరేంద్ర మోదీ ముందుండి మార్గనిర్దేశం చేశారు. సంస్కరణల్లో భాగస్వామిగా ఉండటం నా జీవితంలో ఒక గొప్ప గౌరవం” అంటూ దత్తాత్రేయ కృతజ్ఞతలు తెలిపారు. “చట్టాలు కాగితం మీద మాత్రమే కాకుండా – కార్మికుల జీవితాలలో మార్పు తెచ్చేలా అమలు కావాలి” అని అన్నారు. ఈ సంస్కరణలను రాజకీయపరంగా కాకుండా, దేశ సామాజిక–ఆర్థిక అభివృద్ధి కోణంలో చూడటం అత్యవసరమని, భవిష్యత్ తరాలకు మద్దతు ఇస్తున్న మార్గదర్శక చట్టాలివి అని అన్నారు.


