కాకతీయ, కరీంనగర్ : సంఘ వికాసంతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ సహసంఘచాలక్ డాక్టర్ చక్రవర్తుల రమణాచారి అన్నారు. కరీంనగర్‌లోని శిశుమందిర్‌లో వారం రోజులపాటు జరుగుతున్న శిక్షావర్గ ప్రారంభ ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేశాన్ని మాతృభూమిగా ప్రేమించే స్వయంసేవకులలో అనుశాసనం, దేశభక్తి, సేవాభావం వంటి గుణాలను ఆర్‌ఎస్‌ఎస్ శాఖలు నిర్మిస్తాయని చెప్పారు.
1925 నుండి సంఘ శాఖల ద్వారా వ్యక్తి నిర్మాణం జరుగుతోందని గుర్తుచేశారు. శరీరంలోని ప్రతి కణం శరీర దారుఢ్యానికి ఎలా పని చేస్తుందో, అలానే దేశంలోని ప్రతి సామాన్యుడు దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. భారతదేశ పరమ వైభవ ద్వారానే విశ్వ కళ్యాణం, విశ్వ శాంతి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.
గ్రామీణ క్షేత్రాలలో సంఘ శాఖల నిర్మాణానికి శిక్షణ పొందుతున్న స్వయంసేవకులు కృషి చేయాలని కోరారు. ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ కార్యవాహ సత్యనారాయణ, మల్లోజుల కిషన్ రావు, స్వయంసేవకులు తదితరులు పాల్గొన్నారు.


