కాకతీయ, తెలంగాణ బ్యూరో: వరంగల్ జిల్లా నర్సంపేటలో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. సాధారణంగా సీమంతం అంటే మనుషులకే నిర్వహించే వేడుక అని అనుకుంటాం. కానీ గ్రామస్థులు ఓ ఆవుకు సీమంతం నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. గ్రామంలో ఉన్న ఓ కుటుంబం తమ ఇంట్లో పెంచుతున్న ఆవు గర్భవతిగా ఉందని తెలుసుకొని, దానికి సాంప్రదాయ పద్ధతుల్లో సీమంతం జరిపారు. పల్లెటూరి ఆచారాల ప్రకారం మహిళలకు చేసే విధంగానే పసుపు, కుంకుమతో ఆవును అలంకరించి, పూలదండలు వేసి, శుభకార్యాల వాతావరణం సృష్టించారు. ప్రత్యేకంగా పూజలు చేసి, ఆవు చుట్టూ మహిళలు సాంప్రదాయ పాటలు పాడుతూ వేడుక జరిపారు.
ఈ వేడుకలో గ్రామ పెద్దలు, స్థానికులు, చిన్నపిల్లలు అందరూ పాల్గొన్నారు. ఆవు చుట్టూ చిందులు వేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమం చూసినవారు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆవు పాలు ఇస్తుంది కాబట్టి దానిని “గృహలక్ష్మి”గా భావిస్తారు. అందుకే దానికి సీమంతం నిర్వహించి గౌరవం ఇచ్చామని గ్రామస్థులు తెలిపారు.
ఈ సంఘటన నర్సంపేటలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆవుకు సీమంతం జరిపిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్లలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. పాత సాంప్రదాయాలకు కొత్త అర్థం ఇస్తూ ఇలా నిర్వహించిన వేడుక అందరికీ మంచి గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు.


