కాకతీయ, తెలంగాణ బ్యూరో: నారాయణపేట జిల్లా మక్తల్ మండలం అనుగొండ గ్రామంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆదిత్య అనే 10 ఏళ్ల బాలుడు ఇంటి పక్కన ఉన్న పాడుబడిన మట్టి మిద్దెలో ఆడుకుంటుండగా దురదృష్టవశాత్తు మిద్దె కూలిపడి అతని మీద పడింది.
ఈ ఘటనలో బాలుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. తల్లిదండ్రులు, గ్రామస్తులు అతన్ని వెంటనే మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అయితే మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారి మృతిచెందడంతో కుటుంబంలోనే కాకుండా మొత్తం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ సంఘటనపై గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, పాడుబడిన మిద్దెలను తొలగించడంలో నిర్లక్ష్యం వహించకూడదని, ఇటువంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.


