మీనాక్షితో నల్గొండ రమేష్ భేటీ?
రాజధానికి చేరిన వరంగల్ తూర్పు రాజకీయం
హైదరాబాద్‌లో మీనాక్షి నటరాజన్‌తో పలువురు నేతల కీలక భేటీ
వరంగల్ తూర్పు రాజకీయ సమీకరణాలపై సుదీర్ఘ చర్చ
‘మీకు నేను ఉన్నాను’ అని మీనాక్షి భరోసా
భాగ్యనగరంలో హాట్ టాపిక్‌గా వరంగల్ తూర్పు రాజకీయం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వరంగల్ కాంగ్రెస్ జిల్లా రాజకీయాలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు చేరాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు భాగ్యనగరంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో వరంగల్‌కు చెందిన కాంగ్రెస్ నేతలు నల్గొండ రమేష్, కొరివి పరమేష్ హైదరాబాద్‌లో పార్టీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్‌ను కలిసి కీలక భేటీ నిర్వహించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణాలు, పార్టీ పరిస్థితి, భవిష్యత్ వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నేతలు ఆమె దృష్టికి తీసుకెళ్లగా, అందుకు పూర్తి సహకారం అందిస్తానని మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చినట్లు సమాచారం. “మీకు నేను ఉన్నాను” అంటూ పార్టీ నేతలకు భరోసా కల్పించినట్లు తెలిసింది. ఈ భేటీతో వరంగల్ తూర్పు కాంగ్రెస్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయని, రాబోయే రోజుల్లో అక్కడి రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.


