ప్రజావాణీలో మై విలేజ్ షో గంగవ్వ
రైతుల సమస్యతో అధికారుల ముందుకు
లంబాడిపల్లెలో ధాన్యం కొనుగోలు కేంద్రం కోరుతూ వినతి
కాకతీయ, జగిత్యాల : జగిత్యాల జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో “మై విలేజ్ షో” ఫేమ్ గంగవ్వ పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన స్వగ్రామమైన మల్యాల మండలం లంబాడిపల్లెలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ రైతులు, నాయకులతో కలిసి ప్రజావాణికి వచ్చారు. గ్రామంలో కొనుగోలు కేంద్రం లేకపోవడంతో రైతులు దూర ప్రాంతాలకు వెళ్లి ధాన్యం అమ్ముకోవాల్సి వస్తోందని దీనివల్ల అదనపు ఖర్చులు, ఇబ్బందులు ఎదురవుతున్నాయని అధికారులకు వివరించారు. రైతుల సమస్యను వెంటనే పరిష్కరించి లంబాడిపల్లెలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గంగవ్వ విజ్ఞప్తి చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో గంగవ్వ పాల్గొనడం చర్చనీయాంశంగా మారగా, రైతుల సమస్యపై అధికారులు సానుకూలంగా స్పందించారు.



