- ఘనపూర్ మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు
- దేవాదుల పనులకు రూ. 1001 కోట్లు
- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
కాకతీయ, వరంగల్ బ్యూరో : స్టేషన్ ఘనపూర్ అభివృద్ధే తన లక్ష్యమని ఏడాదిలో రూపురేఖలు మార్చి చూపుతానని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఘనపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు, దేవాదుల 3వ దశ 6వ ప్యాకేజీ పనులకు రూ.1001 కోట్లు మంజూరు అయ్యాయని వెల్లడించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం జనవరిలోనే ఘనపూర్ మున్సిపాలిటీని ఏర్పాటు చేశానని, ఇప్పుడు నిధులు కూడా తీసుకొచ్చానని తెలిపారు.
ఈ నిధులతో మున్సిపాలిటీ కార్యాలయ భవనం, టౌన్ హాల్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సీసీ రోడ్లు, డ్రైన్లు, రహదారి విస్తరణ పనులు చేపడతామని అన్నారు. అలాగే 100 పడకల ఆసుపత్రి, డివిజనల్ ఆఫీస్, డిగ్రీ కళాశాల ఏర్పాటు ద్వారా మున్సిపాలిటీ రూపురేఖలు పూర్తిగా మారుతాయని చెప్పారు. దేవాదుల 3వ దశలో పెండింగ్‌లో ఉన్న పనుల కోసం సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి రూ.1001 కోట్లు మంజూరు చేశారని, జఫర్‌ఘడ్ మండలంలోని చెరువులను రిజర్వాయర్లుగా అభివృద్ధి చేసి 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.
ఏడాదిలో అన్ని పనులు పూర్తి చేసి నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమమే తన ఏకైక లక్ష్యమని, పనిలేని వారి విమర్శలను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ అంశంలో అన్ని పార్టీలు మద్దతు తెలపాలని, కోర్టు కేసులు పెట్టకుండా ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మారుజోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, చిల్పూర్ దేవస్థాన కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నూకల ఐలయ్య, పీఏసీఎస్ చైర్మన్ కర్ణాకర్ రావు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


